మంగళవారం 07 జూలై 2020
Business - May 27, 2020 , 19:03:44

చాలా మంది మహిళలకు నగలు కొనడం తెలియదు

చాలా మంది మహిళలకు నగలు కొనడం తెలియదు

న్యూఢిల్లీ: బంగారం ధరలు రోజురోజుకు కొండెక్కి కూర్చుంటున్నాయి. అయినప్పటికీ బంగారం కొనేవారు తక్కువగా ఉండటం లేదనే చెప్పాలి. అయితే దేశంలోని చాలా మంది మహిళలకు నగలు కొనడం తెలియదంట. బంగారాన్ని అమితంగా ప్రేమించే మహిళలకే బంగారు కొనడం తెలియదంటే ప్రపంచ వింతే కదా! ఇదే విషయాన్ని ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తన సర్వే నివేదికలో వెల్లడించింది.

దేశంలో బంగారు ఆభరణాలకు డిమాండ్‌ పెరిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం 37 శాతం మంది మహిళలు ఇంతవరకు బంగారం కొనుగోలు చేయలేదని డబ్ల్యూజీసీ తేల్చింది. వీరు భవిష్యత్‌లో బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నట్టు తెలిపింది. భారతీయ మహిళల్లో 60 శాతం మంది ఇప్పటికే బంగారు నగలు కలిగివున్నారని, దుస్తులు, పట్టు చీరల తర్వాత రెండో స్థానం బంగారు నగలదేనని పేర్కొన్నది. అయినప్పటికీ బంగారు పరిశ్రమ మరింత కొత్త వినియోగదారులకు చేరేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. పట్టణాలకు చెందిన మహిళల్లో 30 శాతం, గ్రామాలకు చెందినవారు 44 శాతం మంది ఈ కోవకు చెందినవారు ఉన్నారని వెల్లడించింది. 40 శాతం మంది గత 12 నెలల కాలంలో బంగారం, వజ్రాలు, ప్లాటీనం ఆభరణాలను కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్‌ కౌన్సిల్‌ తన నివేదికలో తెలిపింది. వీరి నివేదిక ప్రకారం, చాలా మంది యువతులు బంగారు ఆభరణాల కొనుగోలు చేసే జాబితాలో ఉండగా.. 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయసున్నవారిలో 33 శాతం ఏడాది కాలంలో నగలు కొనుగోలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో యువత బంగారం కొనే అవకాశాలు భవిష్యత్‌లో చాలా తక్కువగా ఉన్నాయి.


logo