మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 04, 2021 , 03:10:11

ఉద్యోగాల వేటలో నిపుణులు

ఉద్యోగాల వేటలో నిపుణులు

  • ప్రతీ నలుగురిలో ముగ్గురు కొత్త కొలువుల వైపు 
  • లింక్డ్‌ఇన్‌ రిసెర్చ్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఈ ఏడాది జాబ్‌ మార్కెట్‌ మరింత పోటీయుతంగా మారనున్నది. దేశంలోని ప్రతీ నలుగురు నిపుణుల్లో ముగ్గురు కొత్త ఉద్యోగాల వేటలో ఉంటారని లింక్డ్‌ఇన్‌ ఉద్యోగాన్వేషకుల పరిశోధన చెప్తున్నది. రాబోయే 12 నెలల్లో మెజారిటీ నిపుణులు ప్రస్తుత ఉద్యోగాలను మారే వీలుందని, దీంతో వారి చూపు కొత్త కొలువుల మీదే ఉంటుందని లింక్డ్‌ఇన్‌ పేర్కొంటున్నది. ఈ తాజా సర్వేలో 1,016 మంది పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోగా.. ప్రతి నలుగురిలో ముగ్గురు 2021లో కొత్త ఉద్యోగాల వేటలో చురుగ్గా ఉంటామని చెప్పారు. కాగా, ప్రతీ ముగ్గురిలో ఇద్దరు (64 శాతం) ప్రొఫెషనల్స్‌ తమ భవిష్యత్తు పురోగతిపై విశ్వాసంతో ఉన్నట్లు ఈ రిసెర్చ్‌లో తేలింది. ఇక ప్రతీ ఐదుగురిలో ఇద్దరు (38 శాతం) నెట్‌వర్కింగ్‌ ఈవెంట్లకు హాజరవ్వాలని యోచిస్తున్నారు. అలాగే 37 శాతం మంది ఆన్‌లైన్‌ లెర్నింగ్‌లో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఉద్యోగాల భర్తీలో నియామక దశలు చాలా ఎక్కువగా ఉన్నాయని దేశంలోని ఉద్యోగార్థుల్లో మూడింటా ఒక వంతుకుపైగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

డిజిటలైజేషన్‌ దిశగా..

గతేడాది జాబ్స్‌ మార్కెట్‌లో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఏడాదీ అవి కొనసాగుతున్నాయని లింక్డ్‌ఇన్‌ ఇండియా టాలెంట్‌ అండ్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ రుచీ ఆనంద్‌ తెలిపారు. టెక్నాలజీ, నాన్‌-టెక్నాలజీకి చెందిన అన్ని పరిశ్రమల్లో రిమోట్‌ వర్క్‌ సంస్కృతి అవసరం అవుతున్నదని చెప్పారు. కాగా, ‘జాబ్స్‌ ఆన్‌ ది రైజ్‌' 2021 ఇండియా జాబితాలో టాప్‌-15 కెరియర్‌ అవకాశాలుగా.. ఫ్రీలాన్స్‌ కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా-డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఎడ్యుకేషన్‌, ఏఐ, డాటా సైన్స్‌, హెల్త్‌కేర్‌, హెచ్‌ఆర్‌ వంటివి ఉన్నాయి. 

ఎడ్యుకేషన్‌, హెల్త్‌కేర్‌ ఆకర్షణీయం

కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు జాబ్‌ మార్కెట్‌ కూడా కుదేలైంది. ముఖ్యంగా నిరుడు దెబ్బతిన్న రంగాలు ఈ ఏడాది ఓ వెలుగు వెలుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్‌, హెల్త్‌కేర్‌, ఈ-కామర్స్‌, ఫైనాన్స్‌ రంగాలు ఆకర్షణీయంగా మారుతాయని అంటున్నారు. ఫ్రీలాన్స్‌ కంటెంట్‌ క్రియేటర్లు, మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయని లింక్డ్‌ఇన్‌ తెలిపింది. ఇక ఇంజినీరింగ్‌, కృత్రిమ మేధస్సు, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్‌ల్లో నియామకాలు ఊపందుకోవచ్చన్నది.

VIDEOS

logo