3.75 కోట్ల మంది ఐటీ రిటర్నుల దాఖలు

న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నుల గడువు దగ్గర పడుతుండటంతో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. ఈ నెల 21 నాటికి 3.75 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. మిగతా వారు కూడా సమర్పించాలని సూచించింది. 2020-21 అసెస్మెంట్ ఏడాదికిగాను ఇప్పటి వరకు 3.75 కోట్ల మంది దాఖలు చేశారు.. మీరు మీ రిటర్నులు ఇంకా సమర్పించలేదా..ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి అని ఐటీ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. వీరిలో 2.17 కోట్ల మంది ఐటీఆర్-1 దాఖలు చేయగా, 79.82 లక్షల మంది ఐటీఆర్-4, 43.18 లక్షల మంది ఐటీఆర్-3, 26.56 లక్షల మంది ఐటీఆర్-2 దాఖలు చేసినట్లు పేర్కొంది. గతేడాదికిగాను పన్ను రిటర్నుల గడువు ఈ నెల 31తో ముగియనున్నది. కరోనా నేపథ్యంలో ఐటీ రిటర్నుల గడువును రెండు సార్లు జూలై 31, అక్టోబర్ 31న మరోసారి పెంచింది. అంతక్రితం ఏడాది 5.65 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసిన విషయం తెలిసింది.