శుక్రవారం 22 జనవరి 2021
Business - Jan 14, 2021 , 02:45:58

విప్రో లాభం 2,968 కోట్లు

విప్రో లాభం 2,968 కోట్లు

  • క్యూ3లో 21 శాతం పెరిగిన ప్రాఫిట్‌
  • ప్రతి షేరుకు రూ.1 డివిడెండ్‌

న్యూఢిల్లీ, జనవరి 13: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో..విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.2,968 కోట్ల లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో వచ్చిన రూ.2,455.9 కోట్ల లాభంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సాధించింది. సంస్థ ఈ విషయాన్ని బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.15,470 కోట్లుగా ఉన్న ఆదాయం..గత త్రైమాసికానికిగాను 1.3 శాతం అధికమై రూ.15,670 కోట్లకు చేరుకున్నది. 

అవుట్‌లుక్‌ ఆశాజనకం

మూడో త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు ప్రకటించిన సంస్థ..నాలుగో త్రైమాసికంపై గంపెడు ఆశ పెట్టుకున్నది. ఈ త్రైమాసికంలో 2,102 మిలియన్‌ డాలర్ల నుంచి 2,143 మిలియన్‌ డాలర్ల వరకు ఆదాయం రావచ్చునని అంచనావేస్తున్నది. 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకోవచ్చునని అవుట్‌లుక్‌లో పేర్కొంది. డిసెంబర్‌ త్రైమాసికంలో సంస్థ 2,071 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతంలో అంచనావేసిన మాదిరిగానే 3.9 శాతం వృద్ధిని సాధించింది. ఐటీ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా రూ.160 కోట్లు(21.3 మిలియన్‌ డాలర్లు), ఎంటర్‌ప్రైజెస్‌ బిజినెస్‌ ద్వారా రూ.240 కోట్లు(32.8 మిలియన్‌ డాలర్లు) ఆదాయం సమకూరింది.  మరోవైపు ప్రతిషేరుకు రూ.1 డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు స్వల్పంగా పెరిగి రూ.458.70 వద్ద స్థిరపడింది. 

‘ఆర్డర్లు, ఆదాయ, మార్జిన్ల పరంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో అంచనాలకుమించి వృద్ధిని సాధించాము. ఐదింటిలో నాలుగు రంగాలు 4 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకున్నాయి. యూరప్‌ నుంచి అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోవడం సంస్థకు కలిసొచ్చింది. అనిశ్చిత పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పడే కోలుకుంటున్నట్లు, ముఖ్యంగా డిజిటల్‌ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది’

- థిర్రీ డెలాపోర్ట్‌, విప్రో సీఈవో, ఎండీ


logo