మంగళవారం 26 మే 2020
Business - Apr 02, 2020 , 23:02:56

రోజుకు రూ.35 వేల కోట్లు

రోజుకు రూ.35 వేల కోట్లు

-21 రోజుల లాక్‌డౌన్‌తో రూ.7.44 లక్షల కోట్ల నష్టం

-అక్యూట్‌ రేటింగ్స్‌ అంచనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ప్రాణ నష్టాన్నేకాదూ.. ఆర్థిక నష్టాన్నీ భారీగానే కలిగిస్తున్నది. ఈ మహమ్మారి ధాటికి దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ నడుస్తుండగా, దీనివల్ల జీడీపీకి పెద్ద దెబ్బే తగులుతున్నది. రోజుకు రూ.35,400 కోట్లు (సుమారు 4.64 బిలియన్‌ డాలర్లు) భారత్‌ నష్టపోతున్నదని అక్యూట్‌ రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ లిమిటెడ్‌ గురువారం అంచనా వేసింది. మొత్తం ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో రూ.7.44 లక్షల కోట్ల (దాదాపు 98 బిలియన్‌ డాలర్లు) నష్టం వాటిల్లవచ్చని చెప్పింది. కరోనా దెబ్బకు మునుపెన్నడూలేని విపత్కర పరిస్థితులు చోటుచేసుకోగా.. వ్యాపారాలు, పారిశ్రామికోత్పత్తి, రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థకు పెను నష్టం వచ్చిపడిందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ అక్యూట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిస్థితి భారత్‌తోపాటు మొత్తం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌-జూన్‌ జీడీపీపై కరోనా ప్రభావం ఉంటుందని, జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంపైనా కనిపిస్తుందని అంచనా వేసింది. మొత్తానికి ఇప్పటికే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న భారత్‌ను కరోనా పెద్ద దెబ్బే కొట్టింది.

ప్రపంచ జీడీపీ 1 శాతం తగ్గొచ్చు

కరోనా వైరస్‌ ఉధృతి కారణంగా ఈ ఏడాది ప్రపంచ జీడీపీ దాదాపు 1 శాతం పడిపోవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇంతకుముందు 2020లో గ్లోబల్‌ జీడీపీ 2.5 శాతంగా నమోదు కావచ్చని పేర్కొన్నది. అయితే వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆ అంచనాను ఇప్పుడు 0.9 శాతం తగ్గించింది. 1.6 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని, రవాణా వ్యవస్థను ఈ విశ్వమారి దారుణంగా దెబ్బతీసిందని వెల్లడించింది. 2009లో ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో గ్లోబల్‌ జీడీపీ 1.7 శాతంగా ఉండగా, ఇప్పుడు అంతకంటే తక్కువకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తుండటం గమనార్హం.


logo