ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 26, 2020 , 18:56:55

ఇన్నోవేటివ్‌ మార్గాలతోనే క్లీన్‌ ఎనర్జీ కల సాకారం

ఇన్నోవేటివ్‌ మార్గాలతోనే క్లీన్‌ ఎనర్జీ కల సాకారం

న్యూఢిల్లీ: భూతాపం నివారణకు కాలుష్య నియంత్రణే మార్గం. అందుకోసం పెట్రోల్‌ సహా ఇతర సంప్రదాయ వనరుల ద్వారా ఇంధన ఉత్పత్తికి బదులు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది నాటికి 35 గిగా వాట్ల సామర్థ్యం గల సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి సాధించాలి. 

ప్రస్తుతం 90గిగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల ప్రాజెక్టుల ఇన్‌స్టలేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇందులో పవన విద్యుత్‌ ద్వారా 39 గిగా వాట్లు, సౌర విద్యుత్‌ ద్వారా 37 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పాదక ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు 50 గిగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 

అప్పుడే 2022 నాటికి ప్రతిష్టాత్మక 175 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని భారత్‌ సంతరించుకోగలుగుతుందని సోలార్‌ పవర్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్ దత్‌ చెప్పారు. కనుక 35 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులను చేపట్టాలంటే రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిధుల సేకరించాలంటే  ప్రత్యేకించి టెండరింగ్‌లో వినూత్న మార్గాలను అన్వేషించాలని శేఖర్‌ దత్‌ అన్నారు. 

బొగ్గు ఆధారిత విద్యుత్‌కు బదులు వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల కింద ఉత్పత్తి చేసిన పవన, సౌర విద్యుత్‌ను నిల్వ చేసేందుకు ఇన్నోవేటివ్‌ టెండర్లను కేంద్ర ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది సంప్రదాయేతర ఇంధన రంగానికి సవాల్‌గా నిలిచినా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ మద్దతుతో సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలిగింది. 

2021లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన బిడ్లను ఆహ్వానించే విషయంలో మరింత వినూత్న వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఆర్‌ కే సింగ్‌ చెప్పారు. భారత్‌ను పెట్టుబడులకు కేంద్రంగా నిలుపాలని తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రత్యేకించి ఇప్పటికే క్లీన్‌ ఎనర్జీ రంగంలో 64 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. అయితే సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన దేశీయంగా తయారైన సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉందని ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. 

అయితే, ప్రస్తుతం సంప్రదాయేతర ఇంధన రంగానికి నిర్ణీత సమయానికి 20 గిగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంస్థలు ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ కొనుగోలుకు హామీ లభించినప్పుడే నిర్దేశిత 175 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోగలమంటున్నారు. లేకపోతే సంబంధిత విద్యుత్‌ తయారీ సంస్థలు భారీ స్థాయిలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి వసతులు పెంచేందుకు ముందుకు రావన్న విమర్శ ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo