శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 30, 2021 , 01:17:52

కొత్త చట్టాలతో నవశకం!

కొత్త చట్టాలతో నవశకం!

  • చిన్న, మధ్య తరహా రైతుల కోసమే సాగు చట్టాలు
  • వ్యవసాయ చట్టాలను సమర్థించిన ఆర్థిక సర్వే

న్యూఢిల్లీ, జనవరి 29: కొత్త వ్యవసాయ చట్టాలను ఆర్థిక సర్వే సమర్థించింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఈ చట్టాలు కొత్త శకానికి నాంది పలుకుతాయని పేర్కొన్నది. దేశంలోని 85% మంది చిన్న, సన్నకారు రైతుల కోసమే  ఈ చట్టాలను తెచ్చినట్లు వెల్లడించింది. వీళ్లంతా వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థలోని లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. తాను పండించిన ధాన్యాన్ని రైతు ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛను ఈ చట్టాలు కల్పిస్తాయని, తద్వారా రైతుల జీవనం మెరుగుపడుతుందని చెప్పుకొచ్చింది. వ్యవసాయ మార్కెట్ల పనితీరు, మార్కెట్లు కొంతమంది గుత్తాధిపత్యంలోకి వెళ్లడంపై గతంలో అనేక ఆర్థిక సర్వేలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. మార్కెట్లలో గుత్తాధిపత్యం పోయి రైతులకు స్వేచ్ఛ లభించాలంటే సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పిన విషయాన్ని, స్వామినాథన్‌ కమిటీ, అహ్లూవాలియా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ సూచనలను ప్రస్తావించింది. వ్యవసాయ మార్కెట్లలో వసతుల లేమి వల్ల పంట చేతికొచ్చాక కూడా రైతు ఎంతో నష్టపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేట్‌ సంస్థల రాకతో రైతులు మార్కెట్‌లో పడిగాపులు కాసే పరిస్థితి తప్పుతుందని, పోటీతత్వం పెరిగి రైతులకు లాభాలు వస్తాయని పేర్కొన్నది. వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్ల ఆలస్యం వల్ల పంట ఉత్పత్తులు పాడవుతున్నాయని, రైతులు ధాన్యంలో 6 శాతం, కూరగాయల్లో 12 శాతం, పండ్ల అమ్మకాల్లో 18 శాతం నష్టపోతున్నారని, ఈ నష్టం ఏడాదికి దాదాపు రూ. 44వేల కోట్లని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మార్కెట్‌ రేట్లలోని అస్థిరత రైతులపై ప్రభావం చూపకుండా తాజా చట్టాలు నిరోధిస్తాయని తెలిపింది. 

వ్యవసాయం ఆధునిక వ్యాపారం

ప్రభుత్వం వ్యవసాయాన్ని ఆధునిక వ్యాపారంగా చూడాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. వ్యవసాయరంగంలో సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం సంస్కరణలు అత్యవసరమని అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌ సమయంలో అన్ని రంగాల్లో వృద్ధి రేటు తగ్గినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి నమోదు అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. వ్యవసాయ ఉత్పత్తులను భద్రపర్చడానికి సౌకర్యాలను పెంచాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పాఠశాలలు, వ్యవసాయంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై ఆలోచించాలని పేర్కొన్నది. 

VIDEOS

logo