శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Business - Feb 28, 2020 , 00:23:44

హీరో సరికొత్త సూపర్‌ స్పెండర్‌

హీరో సరికొత్త సూపర్‌  స్పెండర్‌
  • ధర రూ.67,300

దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్‌ స్ప్లెండర్‌ను బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది హీరో మోటోకార్ప్‌. ఈ బైకు ప్రారంభ ధరను రూ.67,300గా నిర్ణయించింది. 125 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు 10.73 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నది. పాత మోడల్‌తో పోలిస్తే 19 శాతం అధికం ఇది. రెండు రకాల్లో లభించనున్న ఈ బైకు సెల్ఫ్‌ స్టార్ట్‌, డ్రమ్‌ బ్రేక్‌ కలిగిన బైకు ధరను రూ.67,300గాను, సెల్ఫ్‌ స్టార్ట్‌, డిస్క్‌ బ్రేక్‌ మోడల్‌ను రూ.70,800కి విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బీఎస్‌-4 బైకుల ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ..ఇక నుంచి ప్రతి మోడల్‌ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ఇది వరకే స్ప్లెండర్‌ ఐస్మార్ట్‌, స్ప్లెండర్‌ +, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, ప్లెజర్‌ + 110, డెస్టిని 125లను విడుదల చేసింది.


ఒక చార్జింగ్‌తో 250 కిలోమీటర్లు


మరో విద్యుత్‌ కారును ప్రవేశపెట్టింది రెనో. పూర్తిస్థాయి బ్యాటరీ చార్జింగ్‌తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ట్వింగో జేడ్‌ఈ కారును అంతర్జాతీయ విపణిలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. కేవలం నాలుగు సెకండ్లలో సున్న నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 135 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది.  


కారుపై వేలిముద్రకు రూ. 5.8 లక్షలు


మీ చేతి వేలి ముద్రలు మీ కారుపై చూసుకోవాలనుకుంటున్నారా! అయితే విలాసవంతమైన స్పోర్ట్‌ కార్ల తయారీ సంస్థ పోర్షేకు చెందిన 911ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్‌ చేతి వేలి ముద్రలతో పోలిన చిత్రాలను ఈ కారుపై డీజైన్‌ చేసి ఇవ్వనున్నది. ఇందుకోసం 7,500 యూరోల చార్జీ చేయనున్నది. మన కరెన్సీలో ఇది రూ.5.8 లక్షలు.


6.6 సెకండ్లలో 100 కి.మీ వేగం

  • మార్కెట్లోకి స్కోడా ఒక్టావియా ఆర్‌ఎస్‌ 245
  • ధర రూ.35.99 లక్షలు


దేశీయ మార్కెట్లోకి లిమిటెడ్‌ ఎడిషన్‌గా ఒక్టావియా ఆర్‌ఎస్‌ 245 మోడల్‌ కారును ప్రవేశపెట్టింది స్కోడా ఇండియా. మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించిన ఈ కారు ధరను రూ.35.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. కేవలం 200 యూనిట్లు మాత్రమే విక్రయించనున్న ఈ కారుకోసం ముందస్తుగా లక్ష రూపాయలు చెల్లించి,  www.buyskodaonline.co.in  ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చునని కంపెనీ వర్గాలు సూచించాయి. 2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు కేవలం 6.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. అలాగే గంటకు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది.


logo