సోమవారం 01 మార్చి 2021
Business - Dec 25, 2020 , 18:17:53

167 ఏళ్లలో ఫస్ట్‌టైం: రైళ్ల మూత.. దిసీజ్‌ కరోనా ఎఫెక్ట్‌

167 ఏళ్లలో ఫస్ట్‌టైం: రైళ్ల మూత.. దిసీజ్‌ కరోనా ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ: నోయిడాలో పని చేసే సెక్యూరిటీ గార్డు జితేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ‘25 ఏండ్లుగా బీహార్‌లోని నా కుటుంబాన్ని కలుసుకునేందుకు రైలు మార్గంలోనే ప్రయాణిస్తుంటా . కానీ ఈసారి కొన్ని నెలల తర్వాత నా కుటుంబాన్ని చేరుకోగలిగా. ప్రతిఏటా ముందే టికెట్‌ బుక్‌ చేసుకుని రైలులో ప్రయాణించి ఇంటికి చేరుకుంటా. కానీ ఈ సారి ఆ పని జరుగలేదు’ అని వ్యాఖ్యానించాడు. జితేంద్ర మాదిరే లక్షల మంది భారతీయులు తమ సొంత ఇండ్లు, ఊళ్లకు వెళ్లడానికి, మరో చోట ఉద్యోగం చేయడానికి రైలులోనే వెళుతుంటారు. దాదాపు భారతీయుల జీవితంలో రైలు ఒక భాగంగా మారింది. కానీ ఈ ఏడాది పరిస్థితులు మారాయి. దానికి కారణం ప్రపంచ మానవాళినే వణికిస్తున్న వైరస్‌ కరోనా మహమ్మారి.

ప్రయాణికులు చౌకగా, సురక్షితంగా, హాయిగా ప్రయాణించడానికి వీలైన మార్గం భారతీయ రైల్వేలు. సామాన్యుడి నుంచి మధ్య తరగతి వరకు.. చిరుద్యోగి మొదలు కార్పొరేట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ వరకు అందరూ త్వరితగతిన గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణ మార్గం రైల్వే. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి పుణ్యమా? అని రైళ్లు పట్టాలకు, షెడ్లకే పరిమితం అయ్యాయి. తత్ఫలితంగా భారతీయ రైల్వేల 167  ఏండ్ల చరిత్రలో రైల్వే సర్వీసులు నడువకుండానే తొలిసారి భారతీయుల జీవనం సాగిపోయింది. 

ప్రాణాంతక కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి గత మార్చి 24వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రైల్వేల చరిత్రలో తొలిసారి రైలు సర్వీసులు మూత పడ్డాయి. అకస్మాత్తుగా రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని వారు ఎక్కడికక్కడే చిక్కుకున్నారు. 

లాక్‌డౌన్‌కు ముందే వేసవి సెలవులు జాలీగా గడిపేందుకు బుక్‌ చేసుకున్న టిక్కెట్లు రద్దు కావడం కూడా తొలిసారే. కరోనా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వలస లక్షల మంది కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి కాలినడకనే చేరుకున్నారు. 

వలస కార్మికుల దీనగాథలు మీడియా వెలుగులోకి తేవడంతో మే ఒకటో తేదీ నుంచి రైలు సర్వీసులు మళ్లీ పట్టాలెక్కాయి. మే ఒకటో తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు నాలుగు వేళ శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు 23 రాష్ట్రాల మీదుగా నడిపి లక్షల మంది వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. వీటితో వలస కార్మికులకు రిలీఫ్‌ కలిగినా భారీగా టిక్కెట్‌ ధరలు వసూలు చేయడంతో రైల్వే విమర్శలకు గురైంది. కానీ రూ.2000 కోట్లు ఖర్చు చేసి వలస కార్మికులను వారి సొంతూళ్లకు చేర్చామని రైల్వేలు ప్రకటించినా దీనిపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. 

ప్రస్తుతం భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 1089 స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నాయి. కోల్‌కతా మెట్రో రైళ్లలో 80 శాతం నడుస్తున్నాయి. ముంబై సబర్బన్‌ రైళ్లలో 88, చెన్నై సబర్బన్‌ రైళ్లలో 50 శాతం నిర్వహిస్తున్నారు. భారతీయ రైల్వే బోర్డు సీఈవో కం చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది రైల్వేలకు ‘కఠినమైన సంవత్సరం’ అని అంగీకరించారు. గతేడాదితో పోలిస్తే 87 శాతం రెవెన్యూను నష్టపోయింది. ఈ నేపథ్యంలో పార్శిల్‌ సర్వీసులు,  పాలు, ఔషధాలతోపాటు వెంటిలెటర్లతోపాటు నిత్యావసర సరుకులు రవానా చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. 

ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కొరత నేపథ్యంలో ఐదువేలకు పైగా కొవిడ్‌ కేర్‌ కోచ్‌లను రైల్వే అందించింది. మాస్క్‌లు, శానిటైజర్లను తయారు చేయడం ద్వారా జాతి అవసరాలకు చేదోడువాదోడుగా భారతీయ రైల్వే నిలిచింది. కొవిడ్‌-19ను సవాల్‌గా తీసుకున్న రైల్వే.. తన మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. 2050 నాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా వసతుల కల్పన దిశగా ప్రణాళికలు రూపొందించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo