బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Sep 28, 2020 , 00:47:24

రిటైర్మెంట్‌ ఫండ్‌కు ఏది ఉత్తమం?

రిటైర్మెంట్‌ ఫండ్‌కు ఏది ఉత్తమం?

యుక్త వయసులో మనం తీసుకునే నిర్ణయాలే వృద్ధాప్యంలో మన జీవితానికి పూలబాట వేస్తాయి. రిటైర్మెంట్‌ ఓ వరంగా మారాలన్నా.. లేక ఓ శాపంగా మిగిలిపోవాలన్నా మన చేతుల్లోనే ఉన్నది. అందుకే ఉద్యోగ జీవితానికి తొలి అడుగు పడినప్పుడే.. సేవింగ్స్‌కూ పునాదిరాయి వేసుకోవాలి. అప్పుడే జీవితకాలం శ్రమించి అలసిన మనసులకు ఉల్లాసం, ఉపశమనం లభిస్తాయి. సర్వదా పిల్లల బాగోగులకే ప్రాధాన్యత ఇచ్చిన వేతన జీవులకు ప్రశాంతతా దక్కుతుంది.మరి మన కలల విశ్రాంత జీవితానికి ఏ రిటైర్మెంట్‌ ఫండ్‌ ఉత్తమం.. దేనీ ప్రయోజనం ఎక్కువ.. అన్నది తెలుసుకోవడం ప్రతి ఉద్యోగికీ ఇప్పుడు అత్యంత అవసరం.

ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక అవసరాలకు లోటు లేకుండా చూసుకోవాలంటే రిటైర్మెంట్‌ ఫండ్లు చాలా అవసరం. ఎవరైనా ఈ నిధులను సమకూర్చుకోవాలంటే ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు మొదలుపెట్టాలి. ఈ పని ఎంత త్వరగా మొదలుపెడితే అంత ఎక్కువ రిటైర్మెంట్‌ ఫండ్‌ను కూడబెట్టేందుకు వీలవుతుంది. ఇందుకు మార్కెట్లో ఎన్నో పథకాలున్నాయి. వీటిలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌), నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) ముఖ్యమైనవి. ఇవన్నీ అధిక రాబడులను అందించే దీర్ఘకాలిక డిపాజిట్‌ పథకాలే. వీటిలో మీకు సరిగ్గా నప్పే పథకాన్ని ఎంచుకోవాలంటే తొలుత వీటన్నింటి గురించి లోతుగా తెలుసుకోవడం చాలా అవసరం.

ఈపీఎఫ్‌

ఇరవై మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగుల భవిష్య నిధికి చందా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్యోగి వేతనం, కరవు భత్యం నుంచి ప్రతి నెలా 12 శాతం మొత్తాన్ని మినహాయించి అతని పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు సమానమైన మొత్తాన్ని కంపెనీ తన వాటాగా చెల్లిస్తుంది. ఈపీఎఫ్‌లో పెన్షన్‌ నిధులు కూడా ఉంటాయి. వీటిని రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగికి అందజేస్తారు. కొన్ని పరిస్థితుల్లో మెచ్యూరిటీకి ముందే ఈ నిధులను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉద్యోగికి ఉంటుంది. ఈపీఎఫ్‌ డిపాజిట్లకు ప్రస్తుతం 8.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

వీపీఎఫ్‌

ఈపీఎఫ్‌లో అంతర్భాగమే వీపీఎఫ్‌. ఈపీఎఫ్‌ ఖాతాదారులు మాత్రమే వీపీఎఫ్‌ను ఎంచుకునేందుకు వీలుంటుంది. ఈపీఎఫ్‌ మాదిరిగానే వీపీఎఫ్‌కు కూడా ప్రభుత్వం 8.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగి తన మూల వేతనం, కరవు భత్యంలో 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని భవిష్య నిధిలో జమచేస్తే దాన్నే స్వచ్ఛంద భవిష్య నిధి (వీపీఎఫ్‌) అంటారు. ఈ పథకం కింద ఉద్యోగి తన పీఎఫ్‌ చందాను పెంచుకుని దీర్ఘకాలంలో అధిక లాభాన్ని పొందేందుకు వీలుంటుంది.

పీపీఎఫ్‌

రిటైర్మెంట్‌ నిధిని కూడబెట్టేందుకు పీపీఎఫ్‌ చాలా ఉత్తమ పెట్టుబడి మార్గం. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పొదుపు పథకం. ఈఈఈ  ట్యాక్స్‌ హోదాను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఈ పథకంలో మెచ్యూరిటీ మొత్తంతోపాటు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.1.5 లక్షల ఆదాయ పన్నును పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం 15 ఏండ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. అవసరమైతే మరింత పొడిగించుకునేందుకు వీలుంటుంది. పీపీఎఫ్‌ డిపాజిట్లకు ప్రస్తుతం 7.1% వడ్డీ చెల్లిస్తున్నారు. రిస్క్‌ లేకుం డా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలను ఇష్టపడనివారు పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు.

ఎన్‌పీఎస్‌

ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004లో ప్రారంభించిన ఎన్‌పీఎస్‌.. 2009 నుంచి సాధారణ పౌరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. 18 నుంచి 60 ఏండ్లలోపు వయసున్న భారత పౌరులెవరైనా దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు వీలున్నది. దేశంలోని ఏ ప్రభుత్వ బ్యాంకు లేదా ప్రైవేట్‌ బ్యాంకులోనైనా ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరువవచ్చు. ఎన్‌పీఎస్‌ నిర్వహణ మ్యూచువల్‌ ఫండ్‌ మాదిరిగానే జరుగుతుంది. కనుక ఈ పెట్టుబడి మార్గం ద్వారా మంచి లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. దీనిలో పెట్టుబడి పెట్టాలనుకునే ఉద్యోగులు ప్రతి నెలా లేదా ఏటేటా కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్విటీలు, కార్పొరేట్‌ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో ఈ పెట్టుబడులు పెట్టవచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత ఈ కార్పస్‌ ఫండ్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా వెనక్కు తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని పీఎఫ్‌ఆర్‌డీఏ (పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఆమోదించిన బీమా కంపెనీల నుంచి నెలవారీ పెన్షన్‌ రూపంలో పొందవచ్చు.


logo