శనివారం 05 డిసెంబర్ 2020
Business - Sep 06, 2020 , 01:01:51

గృహ రుణ గ్రహీతలకు ఊరట

గృహ రుణ గ్రహీతలకు ఊరట

  • వడ్డీరేట్ల మార్పు కాలపరిమితిని తగ్గించిన ఎస్బీఐ
  • ఇకపై 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ విధానం

ముంబై, సెప్టెంబర్‌ 5: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ.. తమ గృహ రుణ గ్రహీతలకు ఊరటనిచ్చింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) మార్పు కాలపరిమితిని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. ఎంసీఎల్‌ఆర్‌లో వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనం కోసం రుణ గ్రహీతలు ఇక ఏడాది వరకు వేచి చూడక్కర్లేదని ట్వీట్‌లో పేర్కొన్నది. రేపో రేటు ఇతర మార్కెట్‌ ఆధారిత ప్రామాణికాలపై రుణాలను తీసుకోకుండా ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలను తీసుకున్నవారికి ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు త్వరగా అందడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ నిర్ణయం రుణాల మంజూరుకు ఊతమివ్వగలదన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7 శాతంగా ఉన్నది. 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 6.95 శాతంగా ఉన్నది. ఈ ఏడాది ఈ రెండు రేట్లను 90 బేసిస్‌ పాయింట్ల వరకు బ్యాంక్‌ కోత పెట్టింది. అయితే కొత్తగా రుణాలను తీసుకున్నవారికే ఈ 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ సవరణలు వర్తిస్తాయని ఓ ఎస్బీఐ కస్టమర్‌ కేర్‌ ఉద్యోగి ద్వారా తెలుస్తున్నది.