బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Aug 18, 2020 , 22:32:00

ఆ రోజుల్లో... సెలవిస్తే ఏం?

ఆ రోజుల్లో... సెలవిస్తే ఏం?

నవమాసాల వేదనకు ప్రతిఫలమే కాబట్టి... మాతృత్వానికి అంత గౌరవం. బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లి పడే యాతన పునర్జన్మతో సమానం. మరి నెలనెలా తను పడే బాధ సంగతి ఏంటి? ఆ మూడురోజుల నరకాన్ని ఎందుకు చిన్నచూపు చూడాలి. అందుకే ఇప్పుడు పీరియడ్స్‌ సమయంలో మహిళలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనే వాదన మొదలవుతోంది...

మగవాళ్ల ఆరోగ్యం ఏడాది పొడవునా ఒకేలా ఉండవచ్చు. కానీ ఆడవాళ్లకి మాత్రం నెలనెలా ఆ మూడు రోజులూ... లోకం తలకిందులైపోతుంది. చికాకు, నిస్సత్తువ సరే... పొత్తికడుపుని మెలితిప్పేసే ‘డిస్‌మెనోరియా’తో యాభై శాతానికి పైగా మహిళలు నరకాన్ని అనుభవిస్తారు. తీవ్ర రక్తస్రావం నుంచి కళ్లు తిరగడం వరకు డిస్‌మెనోరియా చాలా సమస్యలే సృష్టిస్తుంది. మందులు వేసుకుంటే లేనిపోని సైడ్‌ఎఫెక్ట్స్‌, పోనీ విశ్రాంతి తీసుకుందామంటే గిల్టీ ఫీలింగ్‌. అందుకే ఆ బాధని పంటిబిగువున అదిమిపెట్టుకునే, రోజును గడపాల్సి వస్తుంది. ఇంట్లో ఎలాగూ పని తప్పదు, ఆఫీసుకి వెళ్తే... ఉద్యోగ బాధ్యతలు సరేసరి. అందుకే నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది.

జొమాటో ముందడుగు

మన దేశంలో.... కొన్ని ప్రభుత్వ విభాగాలు మహిళా ఉద్యోగులకు, నెలసరి కోసం ప్రత్యేక సెలవులను కల్పిస్తున్నాయి. కానీ టార్గెట్లు, డెడ్‌లైన్లు అంటూ అంతకంటే ఎక్కువ ఒత్తిడి మధ్య గడిపే ప్రైవేట్‌ మహిళా ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వెసులుబాట్లూ లేవు. అందుకే ఈ నెల మొదట్లో జొమాటో చేసిన ప్రకటన ఓ కొత్త మార్పునకు స్వీకారం చుట్టింది. పీరియడ్స్‌ సమయంలో స్త్రీలు సెలవు పెట్టుకునేందుకు, ఏడాదికి పది రోజుల సెలవులను మంజూరు చేస్తున్నట్టు జొమాటో సీఈఓ ‘దీపిందర్‌' ప్రకటించారు. ‘మీరు పీరియడ్‌ లీవ్‌లో ఉన్నారని చెబుతూ నిర్మొహమాటంగా ఈ సెలవులను వాడుకోండి’ అంటూ తన ఉద్యోగులను ప్రోత్సహించారు. ఆశ్చర్యకరంగా జొమాటో ప్రకటన పట్ల కొందరు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అది స్త్రీలు కావడం విశేషం.

ఇదీ వివాదం!

పీరియడ్‌ సెలవుల వల్ల, తాము పురుషులతో సమానంగా రాణించలేకపోతాం అన్నది కొందరి వాదన. ‘దీని వల్ల మేం సైన్యంలో చేరలేం, యుద్ధరంగం నుంచి రిపోర్ట్‌ చేయలేం, అంతరిక్షంలోకి వెళ్లలేం. కాబట్టి మాకు ప్రత్యేక సదుపాయాలు వద్దు’ అంటారు ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌. బర్ఖాదత్‌ మాటలతో ఏకీభవించేవారు లేకపోలేదు. కానీ ప్రసూతి సెలవలు లాగానే, ఈ ప్రత్యేక సెలవలు కూడా వారి ఉద్యోగాల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని కెరీర్‌ నిపుణులు హామీ ఇస్తున్నారు. నిజానికి ఈ వెసులుబాటు లేకపోవడం వల్లే, మహిళలు మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని గుర్తుచేస్తున్నారు. జీతం ఎక్కడ పోతుందో అని చాలామంది మహిళలు, నెలసరి సమయంలో బలవంతంగా పనిచేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఉద్యోగానికి అడ్డంకిగా ఉంటోందని గర్భసంచిని తొలగించుకుని, బతుకు గతిని మార్చుకున్న మహిళలూ ఉన్నారు. అందుకే ఈ తరహా సెలవుల కోసం కార్మికచట్టంలో మార్పులు తేవాలని కోరుతున్నారు. పీరియడ్‌ అంటే ఇంగ్లిష్‌ వ్యాకరణంలో ఒక వాక్యం సమాప్తం అని అర్థం. పీరియడ్స్‌ తమకి ప్రత్యేకం కాబట్టి, హక్కులు కూడా ప్రత్యేకంగా ఉండాలని నినదించినప్పుడే... ఆ మాటకు ఓ కొత్త అర్థాన్ని ఇవ్వగలం.


logo