గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 23, 2020 , 01:20:18

ఖర్చుల్లో జాగ్రత్త!

ఖర్చుల్లో జాగ్రత్త!

  • కరోనా నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న వినియోగదారులు.. కేపీఎంజీ ఇండియా సర్వే         

న్యూఢిల్లీ, జూలై 22: కరోనా వైరస్‌.. ఖర్చుల్లో నియంత్రణను తెచ్చింది. చాలామంది ఇప్పుడు ఖర్చుల విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఎంతో అవసరమైతేగానీ జేబులో నుంచి పైసలు తీయడం లేదని ఓ తాజా సర్వేలో తేలింది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇండియా సర్వే ప్రకారం దేశంలో 78 శాతం మంది తమ ఖర్చులపై గతంతో పోల్చితే ప్రస్తుతం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘టైమ్‌ టు ఓపెన్‌ మై వాలెట్‌ ఆర్‌ నాట్‌?’ శీర్షికతో ఓ నివేదికను కేపీఎంజీ విడుదల చేసింది. దీనితో తమ అభిప్రాయాలను పంచుకున్నవారిలో అత్యధికులు కరోనా వైరస్‌ నేపథ్యంలో విచక్షణతో ప్రవర్తిస్తూ అనవసర ఖర్చుల జోలికి వెళ్లడం లేదని తెలియజేశారు. అయినప్పటికీ 51 శాతం మంది ఈ కొవిడ్‌-19 ప్రభావం తాత్కాలికమేనని, త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

నగరాలపైనే ప్రభావం

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే జనసాంద్రత అధికంగా ఉండే నగరాలు, పట్టణాలపైనే కరోనా పంజా విసురుతున్నది. దీంతో సిటీ ఆ తర్వాత టౌన్లలో నివసించే ప్రజలకు పల్లె వాసుల కంటే కరోనా కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజా సర్వేలోనూ ఇదే స్పష్టమైంది. ఈ క్రమంలోనే నగరవాసుల కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలు దాదాపు రెండు రెట్లు అధికంగా తమ ఖ ర్చులపై విశ్వాసాన్ని కనబరిచారు. కరోనాకు ముందుతో పోల్చితే నగరవాసుల ఖర్చులు చాలావరకు తగ్గిపోగా, మిగతా ప్రాంతాల్లోని వినియోగదారుల ఖర్చుల్లో పెద్దగా తేడాలు కనిపించలేదు. దీంతో ద్వితీయ, తృతీయ పట్టణాల్లో         అనవసర ఖర్చులు చాలాచాలా తక్కువని తేలినట్లు కేపీఎంజీ ఇండియా ప్రతినిధి హర్ష అన్నారు.

కరోనా ప్రభావం గ్రామీణ భారతంపై తక్కువగా ఉండటంతో   రిటైలర్లు ఇక్కడి మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు. ప్రజల జీవన, ఆదాయ వనరులు భద్రంగా ఉండటంతో ఇక్కడ కొనుగోలు శక్తి పెద్దగా దెబ్బతినలేదని కేపీఎంజీ సర్వే కూడా నిరూపించింది. రాబోయే మూడు నెలల్లో రూ.5వేల వరకు ఖర్చు చేస్తామన్న ధీమాను 49 శాతం మంది వ్యక్తం చేయడం ఇందుకు అద్దం పడుతున్నది. 30 శాతం మంది ఇకపై తమ ఖర్చులు ఇంతకుముందుతో పోల్చితే పెరుగడం లేదా యథాతథంగా ఉంటాయే తప్ప తగ్గబోవన్నారు. దీన్నిబట్టి రిటైల్‌ వ్యాపారానికి ప్రధాన నగరాలు, పట్టణాల కంటే మోస్తరు పట్టణాలు, గ్రామాల్లోనే డిమాండ్‌ ఉంటుందన్న విషయం అర్థమవుతున్నదని హర్ష చెప్పారు.


logo