సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 04, 2020 , 02:14:10

ఒక్క క్లిక్‌తో వస్తు నాణ్యత

ఒక్క  క్లిక్‌తో   వస్తు నాణ్యత

  • ఒకే వెబ్‌సైట్‌లో ఉత్పత్తులు, ముడి సరుకుల వివరాలు.. 
  • త్వరలో అందుబాటులోకి తేనున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ

మనం కొనే వస్తువు నాణ్యమైనదేనా?.. నాణ్యమైనవి ఎక్కడ దొరుకుతాయి?.. తయారీకి ఉపయోగించే ముడి సరుకు ఏమిటీ?.. ఇవన్నీ తెలుసుకోవాలంటే గూగుల్‌ సెర్చ్‌ చేయాల్సిందే.

ఒక్కో వస్తువు కోసం ఒక్కో సైట్‌లో వెతకాల్సిందే. అందులోనూ పరిశ్రమల యాజమాన్యాలే వివరాలు పెడుతుండటంతో  సమాచారంలో విశ్వసనీయత ప్రశ్నార్థకమే. 

అయితే వినియోగదారులు, పరిశ్రమ యాజమాన్యాలకు ఉపయుక్తంగా.. అన్ని వస్తువుల సమాచారం ఒకేచోట లభించేలా రాష్ట్ర పరిశ్రమల శాఖ ‘ఇండస్ట్రీస్‌ క్యాట్‌లాగ్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేరిట సమగ్ర సమాచారాన్ని సేకరించి అందుబాటులోకి తెస్తున్నది.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఏ వస్తువులు తయారవుతున్నాయి? ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తున్నది? ఇతర రాష్ర్టాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారా? తయారుచేసే వస్తువుల సామర్థ్యమెంత? అనే వివరాలు ఒకేచోట లభించేలా తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో పరిశ్రమల యాజమాన్యాలకు, వినియోగదారులకు ఎక్కడ ఏ సరుకు లభిస్తుందో తెలుసుకొనే వెసులుబాటు కలుగనున్నది. ముడి సరుకును ఇక్కడే తయారు చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో కూడా తెలుస్తుంది. దీంతో ఏ రంగంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నాయన్నదీ సులువుగా తెలుసుకోవచ్చు. ‘ఇండస్ట్రీస్‌ క్యాట్‌లాగ్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేరుతో రిసోర్స్‌ మ్యాపింగ్‌ చేయాలనే ఉద్దేశంతో పరిశ్రమల శాఖ ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ వివరాలన్నింటినీ టీఎస్‌-ఐపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అన్ని జిల్లాల పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్ల ద్వారా ఆయా కంపెనీలకు సమాచారమిచ్చి వారితో వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయిస్తున్నారు. వీలైనంత త్వరలోనే ఈ వివరాలను అందరికీ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ కావడంతో అందులోని సమాచారానికి విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులు దీన్నే ఉపయోగించుకునే అవకాశమూ ఉంటుంది. అంతేగాక రాష్ట్రం లో ఎవరైనా కొత్త పరిశ్రమ పెట్టాలనుకునేవారికి, ఇక్కడున్న పరిశ్రమలకు వేరే రాష్ర్టాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి సరుకు గురించి తెలుసుకోవడం సులువవుతుంది. ఇలా రెం డు రకాలుగా సదరు వివరాలు ఉపయోగపడనున్నాయి. కంపెనీలు తయా రు చేసే ఉత్పత్తులతోపాటుగా వాటి ఫొటోలనూ ఇందులో అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. 

ముందుకొస్తున్న సంస్థ‌లు

పరిశ్రమల శాఖ చేస్తున్న ప్రయత్నాలకు ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి విశేష స్పందన వస్తున్నదని అధికారులు చెప్తున్నారు. యాజమాన్యాలకు కూడా ప్రయోజనం ఉండటంతో వివరాల నమోదుకు ముందుకొస్తున్నారని పేర్కొంటున్నారు. https:// ipass. telangana.gov.in/UI/TSiPASS/frmcapturemsmenew.aspx వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చే సమయంలో వారు ఏ ఉత్పత్తులు తయారు చేస్తారో కాగితాల మీద తెలుపుతారు. కానీ ఒకే దగ్గర ఒక్క క్లిక్‌తో సమాచారం లభించడం లేదు. వీటన్నింటికీ క్యాట్‌లాగ్‌ ద్వారా పరిష్కారం లభించనున్నది.


logo