మంగళవారం 02 జూన్ 2020
Business - May 04, 2020 , 02:59:55

కోలుకోవాలంటే ఏడాదిపైనే

కోలుకోవాలంటే ఏడాదిపైనే

కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ.. తిరిగి కోలుకోవడానికి ఏడాదికిపైనే పడుతుందని మెజారిటీ సీఈవోలు అంచనా వేస్తున్నారు. ఈ ఏప్రిల్‌-జూన్‌లో ఆదాయం 40 శాతం కోల్పోతామని సీఐఐ సర్వేలో అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో స్తంభించిన వ్యాపార, పారిశ్రామిక రంగాలు దేశ జీడీపీని పాతాళంలోకి పడేశాయి. లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల్లో కోతలు తప్పవని తాజా అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 50 శాతం సంస్థలు సంకేతాలివ్వడం కలవరపెడుతున్నది. 40 రోజుల లాక్‌డౌన్‌లో రోజుకు రూ.60 వేల కోట్ల నష్టం వచ్చినట్లు ఆర్థిక నివేదికలు చెప్తుండటం భారత వృద్ధి ఆశల్ని ఆవిరి చేసేస్తున్నాయి.

దేశ  ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని కార్పొరేట్లు అంచనా వేస్తున్నారు.కరోనా వైరస్‌ నేపథ్యంలో అమలవుతున్న లాక్‌డౌన్‌.. వ్యాపారాలను కుప్పకూల్చిందని మెజారిటీ సంస్థల సీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన ఓ సర్వేలో 65% సంస్థలు ఈ ఏప్రిల్‌-జూన్‌త్రైమాసికంలో 40%పైగా ఆదాయం కోల్పోవచ్చని అంచనా వేశాయి.

  • తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా వైరస్‌
  • లాక్‌డౌన్‌తో కుప్పకూలిన వ్యాపారాలు
  • ఏప్రిల్‌-జూన్‌ ఆదాయం 40% ఆవిరి: సీఐఐ సర్వే

న్యూఢిల్లీ, మే 3: కరోనా నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుని నిలబడేందుకు ఏడాదికిపైగానే సమయం పడుతుందని 45 శాతం మంది సీఈవోలు అంటున్నారు. దాదాపు 36.5 శాతం మంది 6 నుంచి 12 నెలలు పట్టవచ్చని అంటుండగా, సుమారు 17 శాతం మంది 3 నుంచి 6 నెలల్లో కోలుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆదివారం సీఐఐ తెలియజేసింది. అయినప్పటికీ కరోనా, లాక్‌డౌన్‌ పరిణామాలతో దేశంలో దీర్ఘకాల ఆర్థిక మందగమనం చోటు చేసుకుందని మెజారిటీ సీఈవోలు స్పష్టం చేశారు. అందుకే లాక్‌డౌన్‌ ముగిసిన ఏడాది తర్వాతగానీ వృద్ధికి అవకాశం లేదన్నారు. దేశవ్యాప్తంగా 300 మందికిపైగా సీఈవోలు తాజా సర్వేలో పాల్గొన్నారు. వీరిలో దాదాపు మూడింటా రెండు వంతుల మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు చెందినవారే.

వేధిస్తున్న ఉత్పత్తి కొరత

లాక్‌డౌన్‌తో ఉత్పాదక రంగం పూర్తిగా మూతబడింది. మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి లేదని, దీనివల్ల భవిష్యత్‌ వ్యాపారం ప్రభావితం అయ్యే వీలుందని చాలా సంస్థలు ఈ సందర్భంగా ఆందోళన వెలిబుచ్చాయి. ఆదాయం సరిపడా లేక ప్రజల్లో కొనుగోళ్ల శక్తి కూడా మందగించే అవకాశాలున్నాయని ప్రతీ నాలుగు సంస్థల్లో మూడు అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 40 శాతానికిపైగా ఆదాయం కోల్పోతామని 33 శాతం సంస్థలు అంటుంటే.. 20 నుంచి 40 శాతం నష్టపోవచ్చని దాదాపు 32 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఉద్యోగాల్లో కోతలు

వ్యాపారం స్తంభించి, ఆదాయం కోల్పోయిన సంస్థలు.. వ్యయ నియంత్రణ చర్యలకు దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. అందుకే లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల్లో కోతలు తప్పవన్న అభిప్రాయాలు సీఐఐ సర్వేలో వినిపించాయి. సగానికిపైగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తామనే చెప్పడం గమనార్హం. ఇందులో 45 శాతం సంస్థలు 15 నుంచి 30 శాతం ఉద్యోగులను తీసేస్తామని స్పష్టం చేశాయి. 

ఉద్దీపనల కోసం ఎదురుచూపు

కరోనా వైరస్‌ అంతానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అన్నారు. అయితే ఆర్థికంగా కుప్పకూలిన వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఉద్దీపనల కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. అలాగే వ్యాపారానికి వీలున్న ప్రాంతాలు, పరిశ్రమలున్న జిల్లాల్లో లాక్‌డౌన్‌ను సడలించాల్సిన అవసరం ఉందని కూడా సీఐఐ అభిప్రాయపడింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండగా, ఈ నెల 17దాకా ఇటీవలే దీన్ని కేంద్రం పొడిగించింది. నిజానికి ఆదివారంతో ముగియాల్సి ఉండగా, కరోనా ఉధృతి దృష్ట్యా పెంచారు.



logo