శనివారం 30 మే 2020
Business - May 01, 2020 , 00:49:50

లాక్‌డౌన్‌ పొడిగిస్తే కరోనాను మించి ఆకలి చావులు

లాక్‌డౌన్‌ పొడిగిస్తే కరోనాను మించి ఆకలి చావులు

  • హెచ్చరించిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి

బెంగళూరు, ఏప్రిల్‌ 30: లాక్‌డౌన్‌ను మరో దఫా పొడిగిస్తే దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణించిన వారికంటే ఆకలి ద్వారా మరణించేవారి సంఖ్యే అధికంగా ఉండే అవకాశం ఉన్నదని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి హెచ్చరించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపార రంగాలు స్తంభించిపోయాయని, ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఉత్పత్తి విభాగంలో పనిచేసేవారిని వీలైనంత తొందరగా భాగస్వామ్యం చేయడం మంచిదని వెబ్‌నార్‌లో  అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణిస్తున్న వారితో పోలిస్తే భారత్‌లో చాలా స్వల్పమన్నారు. కరోనా వైరస్‌తో దేశీయంగా వెయ్యి మందికి పైగా మరణించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతియేటా వివిధ కారణాలతో 90 లక్షల మంది మరణిస్తుండగా, వీరిలో నాలుగో వంతు కాలుష్యం భారిన పడి మరణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా కాలుష్యానికి గురవుతున్నది భారతేనన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న 19 కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని మూర్తి హెచ్చరించారు.

పన్ను వసూళ్ళపై ప్రభావం

కరోనా వైరస్‌ పన్ను వసూళ్లపై ప్రభావం చూపనున్నట్లు మూర్తి వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌తో వ్యాపార రంగానికి చెందిన సంస్థలు 15-20 శాతం వరకు ఆదాయం కోల్పోనుండటంతో పన్నుల రూపంలో కేంద్రానికి రావాల్సిన ఆదాయంలో గండిపడనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది భారత్‌ 1.9 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాను మూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 


logo