సోమవారం 01 జూన్ 2020
Business - Apr 26, 2020 , 23:30:57

ఫెడ్‌ నిర్ణయం కీలకం

ఫెడ్‌ నిర్ణయం కీలకం

  • ఈ వారం మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుండటం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వు తీసుకునే నిర్ణయం స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఆరు రుణ పథకాలను మూసేస్తున్నట్లు ప్రకటించడం.. రిటైల్‌ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయనున్నదని, దీంతో ఈవారంలోనూ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావచ్చునని వెల్లడిస్తున్నారు.  భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు రూ.25 వేల కోట్ల మదుపరుల సంపద ఇరుక్కుపోయింది. శుక్రవారం మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకు పరిమితంకానున్నది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు మూతపడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నదని, దీనికి తోడు కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు, చమురు ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. కరోనా వైరస్‌తో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే మాత్రం సూచీలు రివ్వున ఎగిసే అవకాశాలున్నాయన్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వు తన పరపతి సమీక్షను ఈ నెల 29న ప్రకటించబోతున్నది. ఈ వారంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌తోపాటు హెచ్‌యూఎల్‌ తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి.  గత వారంలో సెన్సెక్స్‌ 261.50 పాయింట్లు పతనం చెందింది. 

బ్లూచిప్‌ సంస్థల జోష్‌

స్టాక్‌  మార్కెట్ల భారీ పతనంతో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను కోల్పోతున్న బ్లూచిప్‌ సంస్థలకు ఎట్టకేలకు ఊరట లభించింది. గతవారంలో టాప్‌-10 సంస్థల్లో ఐదింటి మార్కెట్‌ విలువ లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అధికమైంది. వీటిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంకులు ఉన్నాయి. మరోవైపు హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టపోయాయి. 


logo