ఆదివారం 31 మే 2020
Business - Apr 22, 2020 , 17:08:13

ఆదుకోకపోతే అంతే సంగతులు

ఆదుకోకపోతే అంతే సంగతులు

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయ్యి నెల గడిచిపోయింది. చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. అసలే రెండేండ్లుగా అంతంత మాత్రంగా ఉన్న ఆర్థికవ్యవస్థలో ఏ పరిశ్రమ కూడా స్థిరంగా ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఊహించని ఈ సంక్షోభంతో పరిశ్రమల వెన్ను విరిగినట్టేనని పారిశ్రామికవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) నిర్వహించిన తాజా సర్వేలో చిన్నాపెద్ద అన్న తేడాలేకుండా పారిశ్రామికవేత్తలంతా ప్రభుత్వం ఆదుకోకుంటే తాము మళ్లీ కంపెనీలను తెరువలేమని చేతులెత్తేశారు.

ధృవ అడ్వైజర్స్‌తో కలిసి నిర్వహించిన సర్వేలో 72శాతం కంపెనీలు తాము తీవ్రం నుంచి అత్యంత తీవ్రమైన కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మళ్లీ అమ్మకాలు సాధారణ స్థితికి వస్తాయోలేదోనని 70శాతం మంది ఆందోళన వ్యక్తంచేశారు. ముందుగా అనుకున్న విస్తరణ ప్రణాళికలను వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిపాటు వాయిదా వేసుకోవాల్సిందేనని 61శాతం మంది అభిప్రాయపడ్డారు. 60శాతం మంది తమ కంపెనీల్లోకి నిధుల సేకరణ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు. 25శాతం మంది అలాంటి ప్రణాళికలు పూర్తిగా రద్దుచేసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఎన్నో దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యాపారాలన్నీ కరోనా దెబ్బకు పూర్తిగా మూతపడే పరిస్థితి వచ్చిందని ఫిక్కి అధ్యక్షురాలు సంగీతారెడ్డి తెలిపారు. కంపెనీలు, ఉద్యోగాలు, ప్రజలను రక్షించేందుకు తక్షణం భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాబోయే ఒకటి రెండు నెలల్లో చాలా ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదముందని సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధిక మంది అభిప్రాయపడ్డారు.  


logo