శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 16, 2020 , 14:17:38

ఇలా చేస్తే జాబులు కాపాడొచ్చుఃసీఐఐ

ఇలా చేస్తే జాబులు కాపాడొచ్చుఃసీఐఐ

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారత్‌లో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా సంస్థలు కొంతమంది ఉద్యోగులను తొలగించటం లేదా జీతాల్లో కోత పెట్టడం చేస్తున్నాయి. మన దేశంలో ఉద్యోగ కల్పనలో సింహభాగం చిన్న మధ్యతరహా పరిశ్రమలవే. ఈ సంక్షోభం కారణంగా ఆ పరిశ్రమలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. దాంతో లక్షల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. అయితే, ఉద్యోగాల తీసివేతను తగ్గించాలంటే ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని, బహుముఖ వ్యూహం అనుసరించాలని పరిశ్రమల సమాఖ్యలు సూచిస్తున్నాయి.

చిన్న పరిశ్రమలను ఆదుకోవాలంటే వాటికి మరో మూడు నెలలు రుణవాయిదాలపై మారటోరియం విధించాలని సీఐఐ డైరెక్టర్‌ చంద్రజిత్‌ బెనర్జీ అన్నారు. పారిశ్రామిక వ్యవస్థలో ద్రవ్య విస్తరణను ప్రాథమిక దశనుంచి మొదలుపెట్టాలని సూచించారు. బ్యాంకుల నుంచి చిన్న పరిశ్రమలకు మరింత తేలికగా రుణాలు లభించే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం దేశ స్తూల ఉత్పత్తిలో (జీడీపీ) 2 శాతంతో ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఈ చర్యల ద్వారా ఉద్యోగాల తొలగింపులను కొంతవరకు తగ్గించవచ్చని సూచించారు.

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న మరో కీలక రంగం టూరిజం, హాస్పిటాలిటీ. ప్రజలు ఎక్కడా బయటకు వచ్చే పరిస్థితి లేనందున తమ వ్యాపారాలు 100శాతం మూతపడ్డాయని మేక్‌మై ట్రిప్‌ సంస్థ దీప్‌ కల్ర అన్నారు. తమ సంస్థలో ఇప్పటివరకు ఉద్యోగాలు తొలగించలేదని, వేతనాల్లో మాత్రం పోస్టు స్థాయినిబట్టి కోత పెట్టక తప్పలేదని తెలిపారు. టూరిజం పరిశ్రమను మళ్లీ గాడిలో పెట్టాలంటే భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అన్నారు.

 


logo