మంగళవారం 26 మే 2020
Business - Apr 14, 2020 , 12:24:45

25 దేశాలకు అత్యవసర సాయం.. ఐఎంఎఫ్

25 దేశాలకు అత్యవసర సాయం.. ఐఎంఎఫ్

కరోనా సంక్షోభంలో చిక్కి తల్లడిల్లుతున్న పేద దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) శుభవార్త చెప్పింది. తనకు చెల్లించాల్సి అప్పును ఆరు నెలలపాటు చెల్లించనవసరం లేదని తెలిపింది. 25 దేశాలకు ఈ వెసులుబాటును కల్పించినట్లు ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అప్పులు చెల్లించటంలో కల్పించిన వెసులుబాటుతో ఆయా దేశాలకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. దాంతో తమ దేశాల్లో వైద్యసేవలు, ఇతర అత్యవసర పనులకు ఆ నిధులను ఖర్చుచేయవచ్చు అని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిష్టలీనా జార్జీవా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రుణ చెల్లింపు వెసులుబాటు పొందిన దేశాల్లో ఆఫ్గనిస్తాన్‌, యెమెన్‌, నేపాల్‌, హైతీ తప్ప మిగిలినవన్నీ ఆఫ్రికా ఖండ దేశాలే.

కోవిడ్‌-19 విపత్తును ఎదుర్కొనేందుకు ఐఎంఎఫ్‌కు చెందిన క్యాటస్ర్టోప్‌ కంటైన్‌మెంట్‌ అండ్‌ రిలీఫ్‌ ట్రస్ట్‌ (సీసీఆర్టీ) నుంచి కూడా నిధులు సమకూర్చనున్నారు. 2015లో ఆఫ్రికాలో ఎబోలా విజృంచినప్పుడు ఈ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. దీనికి నిధులు సమకూరుస్తున్న ప్రధాన దేశాలు జపాన్‌, బ్రిటన్‌, చైనా, నెదర్లాండ్స్‌. ఈ ఫండ్‌కు ఇతర దేశాలు కూడా నిధులు ఇస్తే పేదదేశాలకు రెండేండ్లపాటు రుణ చెల్లింపు మినహాయింపును ఇవ్వగలమని జార్జీవా తెలిపారు. 


logo