బుధవారం 03 జూన్ 2020
Business - Apr 10, 2020 , 14:03:56

చమురు ఉత్పత్తిలో కోత

చమురు ఉత్పత్తిలో కోత

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం ఒక్కసారిగా తగ్గిపోయింది. దాంతో డిమాండ్‌లేక చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమై చమురు ఉత్పత్తి దేశాలకు తీవ్ర వత్తిడిలోకి నెట్టాయి.ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మే, జూన్‌ నెలల్లో రోజూ 10 మిలియన్‌ బారళ్లవరకు తక్కువ ముడి చమురును ఉత్పత్తి చేయాలని శుక్రవారం నిర్ణయించింది. ఈ కూటమి సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై ఉత్పత్తిలో కోత పెట్టాలని నిర్ణయించారు.

అయితే ఉత్పత్తి తగ్గించేందుకు మెక్సికో అంగీకరించలేదని తెలిసింది. ధరల విషయంలో నిన్నమొన్నటివరకు తీవ్రంగా విభేదించుకున్న రష్యా, సౌదీ అరేబియా ఎట్టకేలకు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయానికి వచ్చాయి. కానీ రోజుకు 4 లక్షల బారళ్ల చమురు ఉత్పత్తి చేసే మెక్సికో మాత్రం ఉత్పత్తి తగ్గించుకోవటానికి ఇంకా అంగీకరించలేదని బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ తెలిపింది. తమ దేశాన్ని లక్షల బారళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఒపెక్‌ కోరినట్లు మెక్సికో చమురుశాఖ మంత్రి రోషియో నెహ్లె గార్షియా ట్వీట్‌ చేశారు.  


logo