బుధవారం 03 జూన్ 2020
Business - Mar 31, 2020 , 12:10:13

మాంద్యంలోకి ప్రపంచం.. ఐరాస

మాంద్యంలోకి ప్రపంచం.. ఐరాస

కోవిడ్‌-19 సృష్టించిన విలయానికి ప్రపంచం మరోసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకొనే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలంటే 2.5 ట్రిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి కాన్ఫరెన్స్‌ అంచనావేసింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్‌-19 షాక్‌’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఎక్కువగా వినియోగ వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే వచ్చే రెండేండ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపింది.

మాంద్యాన్ని నివారించేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు చైనా కూడా తమ ఆర్థిక వ్యవస్థల్లోకి భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తున్నాయని, జీ 20 కూటమి దేశాలు కూడా ఇటీవలే తమ ఆర్థిక వ్యవస్థల్లోకి 5 ట్రిలియన్‌ డాటర్లను పంపింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేసింది. ఇది అసాధారమైన సంక్షోభానికి అసాధారణమైన ప్రతిస్పందన లాంటిదని పేర్కొంది. ‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో మాంద్యంలోకి జారుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. అయితే ఈ మ్యాంద్యం ప్రభావం ఇండియా, చైనాలపై ఉండకపోవచ్చు’ అని ఆ రిపోర్టు వెల్లడించింది.


logo