మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 26, 2020 , 14:58:23

క‌ష్ట‌స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకుల గుడ్‌న్యూస్‌

క‌ష్ట‌స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్ల‌కు బ్యాంకుల గుడ్‌న్యూస్‌

క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపారాల‌న్నీ కుదేలైపోవ‌టంతోపాటు వ్య‌క్తిగ‌తంగా కూడా కోట్ల‌మంది తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు. మ‌న‌దేశంలో కూడా అదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కోట్ల‌మంది రోజుకూలీలు ఉపాధి కోల్పోయారు. ల‌క్ష‌ల ఉద్యోగాలు ఊడిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వ్యాపారాలు చేసుకొని, ఆస్తులు కొనుక్కున్న‌వారు నెలనెలా వాయిదాలు చెల్లించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అదీకాక ఇప్ప‌డు చిన్న‌చిన్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వ‌లేని పరిస్థితిలో ఉన్నాయి. దాంతో త‌మ విలువైన క‌స్ట‌మ‌ర్ల‌ను క‌ష్ట‌స‌మ‌యంలో ఆదుకొనేందుకు ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు ముందుకొచ్చాయి.  క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌త్యేక అత్య‌వ‌స‌ర లోన్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, కెన‌రా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ బ్యాంకులు ప్ర‌క‌టించాయి. దేశంలో బ్యాంకింగ్ రంగంలో  ప్ర‌భుత్వరంగ బ్యాంకుల‌దే 80శాతం వాటా. దాంతో క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకొనేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. 

ఈ ఆప‌త్కాలంలో మా క‌స్ట‌మ‌ర్ల‌కు తోడుగా ఉండాల‌ని నిర్ణ‌యించాం. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని వివిధ రంగాలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించటంలో భాగంగా ద్ర‌వ్యం కొర‌త రాకుండా చూడాల‌ని భావిస్తున్నాం. త‌ద్వారా వ్యాపార‌స్తులు, చిల్ల‌ర వ్యాపారులకు త‌మ వ్యాపారంలో క‌ష్టాలు తీరుతాయి అని ఇండియ‌న్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప‌ద్మ‌జా చుందురు తెలిపారు. కోవిడ్ ఎమ‌ర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు రుణాలు అందివ్వ‌నున్న‌ట్లు యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. రుణాలు కావాల్సిన త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అత్య‌వ‌స‌ర లోన్లు ఇస్తామ‌ని బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌యిన సూక్ష్మ చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్యేక అత్య‌వ‌స‌ర రుణ విధానం ద్వారా రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా తెలిపింది.  

ద్ర‌వ్య స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం రాకుండా చూసేందుకు సూక్ష్మ చిన్న‌త‌ర‌హా, కార్పొరేట్‌, వ్య‌వ‌సాయ‌, చిల్ల‌ర వ్యాపార‌స్తుల‌కు ప్ర‌త్యేక లోన్లు ఇస్తామ‌ని కెన‌రా బ్యాంకు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ బ్యాంకు కోవిడ్-19 లైన్ ఆఫ్ స‌పోర్ట్ స్కీం పేరుతో చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్యేక లోన్ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 


logo
>>>>>>