శనివారం 30 మే 2020
Business - Mar 25, 2020 , 13:05:39

దేవుడి లీల అనుకోండి: లోన్లు క‌ట్ట‌లేం

దేవుడి లీల అనుకోండి: లోన్లు క‌ట్ట‌లేం

క‌రోనా దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న వ్యాపార‌స్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే ప‌రిస్థిలో లేమ‌ని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్‌, టూరిజం, ఆతిథ్య‌రంగాల వ్యాపారాలు క‌రోనా దెబ్బ‌కు కుదేల‌య్యాయి. వ్యాపారాలు పూర్తిగా మూత ప‌డ‌టంతో క‌నీసం ఉద్యోగుల‌కు జీతాలు కూడా చెల్లించ‌లేని ప‌రిస్తితిలోకి కంపెనీలు జారుకున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్యాపారాల కోసం బ్యాంకుల వ‌ద్ద తీసుకున్న అప్పుల‌కు వాయిదాలు చెల్లించ‌లేమ‌ని ప‌లు సంస్థ‌ల నిర్వాహ‌కులు చేతులెత్తేస్తున్నారు. వ్యాపార నిబంధ‌న‌ల్లోని యాక్ట్ ఆఫ్ గాడ్ (దేవుడి లీల‌) సెక్ష‌న్ ఇప్పుడు త‌మ‌కు వ‌ర్తిస్తుంద‌ని, ఆ మేర‌కు వెసులుబాటు ఇవ్వాల‌ని బ్యాంకుల వ‌ద్ద మొర‌పెట్టుకుంటున్నారు. దాంతో బ్యాంకు యాజ‌మాన్యాల‌కు గుండెల్లో గుబులు మొద‌లైంది.

ప్ర‌కృతి విప‌త్తులు, అంటువ్యాధులు, యుద్ధాలు సంభ‌వించిన‌ప్పుడు ప‌రిస్థితి మ‌నిషి చేయిదాటిపోతే ఏంచేయాల‌న్న అంశాల‌ను యాక్ట్ ఆఫ్ గాడ్ నిబంధ‌న చెప్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులు త‌మ క‌స్ట‌మ‌ర్ల క‌ష్టాల‌ను దృష్టిలో ఉంచుకొని లోన్ వాయిదా చెల్లింపుల‌ను తాత్కాలికంగా వాయిదా వేయ‌టం, కొన్ని నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ర‌ద్దుచేయ‌టం జ‌రుగుతుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా వ్యాపారాలు దెబ్బ‌తిన్న చాలామంది త‌మ క‌ష్ట‌మ‌ర్లు యాక్ట్ ఆఫ్ గాడ్ నిబంధ‌న కింద త‌మ లోన్ల‌ను రీషెడ్యూల్ చేయాల‌ని, వాయిదా చెల్లింపుల‌పై లేవీ ఇవ్వాల‌ని చాలామంది కోరుతున్నార‌ని ఓ బ్యంకు అధికారి తెలిపారు. దాదాపు రూ.200 కోట్ల విలువైన ఇలాంటి విజ్ఞ‌ప్తులు త‌మ‌కు వ‌చ్చాయ‌ని ఆ అధికారి తెలిపారు. క‌రోనా ఉత్పాతం నుంచి బ‌య‌ట‌ప‌డి ఈ ఏడాది చివ‌రి త్రైమాసికం ఆశాజ‌న‌కంగా ఉండ‌వ‌చ్చ‌ని రుణ‌దాత‌లు భావిస్తున్నార‌ని ఇండియా నివేశ్ సెక్యూరిటీస్ విశ్లేష‌కుడు ర‌వికాంత్ భ‌ట్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుత విప‌త్తు అన్ని సంస్థ‌లు, వ్య‌క్తుల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని, అందువ‌ల్ల ప్ర‌తి వ్యాపారాన్ని మ‌ళ్లీ గాడిలో పెట్టేలా ఓ ఆర్థిక ప్యాకేజీ అవ‌స‌ర‌మ‌ని తెలిపారు.   


logo