మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 12, 2020 , 00:06:54

రూ.45 వేల దిగువకు పసిడి

రూ.45 వేల దిగువకు పసిడి
  • రూ.510 తగ్గిన తులం ధర

న్యూఢిల్లీ, మార్చి 11: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడం, దేశీయంగా రూపాయి బలోపేతం కావడంతో పసిడి ధర రూ.45 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర బుధవారం ఒకేరోజు రూ.516 తగ్గి రూ.44,517కి పరిమితమైంది. సోమవారం ఈ ధర రూ.45,033గా ఉన్నది. పసిడితోపాటు వెండి మరింత తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి రూ.146 తగ్గి రూ.47,234 వద్ద నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 36 పైసలు బలోపేతం కావడం పసిడి ధరలు తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,661 డాలర్లకు, వెండి 17.03 డాలర్ల వద్ద నిలిచింది. 


అక్షయ తృతీయ నాటికి రూ.50 వేలకు 

బంగారం ధర భగభగ మండబోతున్నదా! అవుననే అంటున్నారు ఆభరణాల వర్తకులు.  ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో అక్షయ తృతీయ నాటికి బంగారం ధర రూ.50 వేల మార్క్‌కి చేరుకునే అవకాశాలున్నాయని ముంబై జ్యూవెల్లరీ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. వచ్చే నెల 26న అక్షయ తృతీయ ఉన్నది. ఈ నెల మొదట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,700 డాలర్ల మార్క్‌ను దాటింది. 2012 తర్వాత ఇదే తొలిసారి. 


logo
>>>>>>