శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 21, 2020 , 01:41:24

ప్రారంభ లాభాలు ఆవిరి

ప్రారంభ లాభాలు ఆవిరి
  • 416 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌

ముంబై, జనవరి 20: స్టాక్‌ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలకు బ్లూచిప్‌ సంస్థల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు దెబ్బతీశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ల ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోకపోవడంతో మదుపరులు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 42,273.87 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 416.46 పాయింట్లు పతనం చెంది 41,528.91కి పరిమితమైంది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 127.80 పాయింట్లు పతనం చెంది 12,224.55 వద్ద నిలిచింది.  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్ల పతనాన్ని శాసించింది. మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ నిరర్థక ఆస్తులు పెరిగినట్లు వెల్లడించడంతో మదుపరుల్లో ఆందోళన బాటపట్టారు. దీంతో బ్యాంక్‌ షేరు ధర 4.70 శాతం తగ్గి టాప్‌ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్లు కూడా మూడు శాతం వరకు కోల్పోయాయి. 

ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్బీఐ, సన్‌ఫార్మా, మారుతి, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌ల షేర్లు పెట్టుబడిదారులను ఆకట్టుకోలేకపోయాయి. మరోవైపు పవర్‌గ్రిడ్‌ 3.75 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రాలు లాభాల్లో ముగిశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ దిగ్గజాల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు వెల్లడించారు. రంగాలవారీగా చూస్తే ఇంధనం, బ్యాంకింగ్‌, చమురు అండ్‌ గ్యాస్‌, ఆర్థికం, మెటల్‌, ఐటీ, ఆటో రంగాల షేర్లు మూడు శాతం వరకు పతనమవగా.... టెలికం, రియల్టీ, యుటిలిటీ, పవర్‌ షేర్లు రెండు శాతం వరకు ఎగబాకాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి 71.31 వద్ద నిలిచింది. 


logo