శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 17, 2020 , 01:20:17

రూ.7 వేల కోట్ల పెట్టుబడులు

రూ.7 వేల కోట్ల పెట్టుబడులు
  • చిన్న, మధ్యతరహా వ్యాపారుల డిజిటలైజేషన్‌ కోసం
  • ప్రకటించిన అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌

న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారుల డిజిటలైజేషన్‌ కోసం గ్లోబల్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ రూ.7 వేల కోట్లకు (1 బిలియన్‌ డాలర్లు)పైగా పెట్టుబడులను పెట్టనున్నది. అంతేగాక 2025కల్లా భారత్‌లో తయారైన 10 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తూత్పత్తుల ఎగుమతి లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నది. ఈ మేరకు అమెజాన్‌ వ్యవస్థాపక సీఈవో జెఫ్‌ బెజోస్‌ బుధవారం ప్రకటించారు. భారత్‌లో 5.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.39 వేల కోట్లు) పెట్టుబడులను పెడుతామని ఇప్పటికే అమెజాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. స్వదేశం అమెరికా తర్వాత అమెజాన్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌ భారతే. దీంతో ఇక్కడ బలమైన శక్తిగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులతో అమెజాన్‌ ముందుకొస్తున్నది. ఈ క్రమంలో మరో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను తాజాగా ప్రకటించింది. ‘భారత్‌కు అమెజాన్‌ దీర్ఘకాల భాగస్వామిగా ఉండాలనుకుంటున్నది.


వచ్చే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలను డిజిటలైజ్‌ చేయడానికి 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నాం. దీనివల్ల మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువమంది కస్టమర్లకు వ్యాపారులు దగ్గర కాగలరు’ అని అన్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఇక్కడకు చేరుకున్న బెజోస్‌.. రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించారు. చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం అమెజాన్‌ ఇండియా నిర్వహించిన సంభవ్‌ కార్యక్రమం లో బుధవారం పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లు, ట్రేడర్లు, తయారీదారులు, స్థానిక సంప్రదాయ దుకాణాలు, బ్రాండ్లు, రీసెల్లర్ల డిజిటలైజేషన్‌ కోసం 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగానే దేశంలోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 100 డిజిటల్‌ హ్యాట్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘అమెజాన్‌ ఇండియా వేదికగా నేడు 5 లక్షల 50 వేలకుపైగా అమ్మకందారులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. 60 వేలకుపైగా తయారీదారులు, బ్రాండ్లు తమ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసుకుంటున్నారు’ అని అమెజాన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నది.


భారత్‌కేమీ మేలుచేయడం లేదు: గోయల్‌

దేశంలో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టి అమెజాన్‌ భారత్‌కేమీ మేలు చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. గురువారం ఇక్కడ రైసినా డైలాగ్‌ 2020లో మాట్లాడిన ఆయన భారతీయ చట్టాలను గౌరవించాలని అమెజాన్‌సహా అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. దేశీయ మల్టీ-బ్రాండ్‌ రిటైల్‌లో ఈ-కామర్స్‌ తరహా విధానాల అమలుపై దర్యాప్తు చేస్తామని, ఇప్పటికే అమెజాన్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణ మొదలు పెట్టిందన్నారు. మల్టీ-బ్రాండ్‌ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు సంబంధించి కఠిన నిబంధనలున్నాయని చెప్పారు.


logo