శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 15, 2020 , 00:19:36

సరికొత్త రికార్డుల్లో స్టాక్‌ మార్కెట్లు

సరికొత్త రికార్డుల్లో స్టాక్‌ మార్కెట్లు
  • ఆల్‌టైమ్‌ హై వద్ద సూచీలు
  • సెన్సెక్స్‌ 93,నిఫ్టీ 33 పాయింట్లు వృద్ధి

ముంబై, జనవరి 14: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరో సరికొత్త స్థాయికి చేరాయి. మంగళవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 92.94 పాయింట్లు పుంజుకుని 41,952.63 వద్దకు చేరి ఆల్‌టైమ్‌ హైలో ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 32.75 పాయింట్లు అం దుకుని మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 12,362.30 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 41,994.26 పాయింట్లను, నిఫ్టీ 12,374.25 పాయింట్లను తాకా యి. సోమవారం కూడా స్టాక్‌ మార్కె ట్లు లాభాల్లోనే ముగియగా, మదుపరుల కొనుగోళ్ల జోరుతో సూచీలు వరుస రికార్డులను సృష్టిస్తున్నాయి.

‘ద్రవ్యోల్బణం పెరిగినా మదుపరులు పట్టించుకోకుండా పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నారు. రాబోయే బడ్జెట్‌, అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఆశలే ఇందుకు కారణం’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. హీరో మోటోకార్ప్‌ షేర్‌ విలువ అత్యధికంగా 2.15 శాతం లాభపడగా, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్ల విలువలు 1.74 శాతం నుంచి 0.74 శాతం పెరిగాయి. అయితే అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో ఆకర్షణీయ లాభాలను నమో దు చేసినా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ విలువ 3.85 శాతం పడిపోవడం గమనార్హం. బీఎస్‌ఈ మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌లు 0.75 శాతం వరకు లాభపడ్డాయి.


logo