శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Jun 17, 2020 , 00:33:05

1.25 లక్షల ఉద్యోగాలిచ్చాయ్‌

1.25 లక్షల ఉద్యోగాలిచ్చాయ్‌

  • 155 కంపెనీలు రూ.1.68 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయ్‌
  • అమెరికాలో భారతీయ సంస్థలపై సీఐఐ సర్వే

న్యూఢిల్లీ, జూన్‌ 16: అమెరికా అభివృద్ధిలో భారత సంతతీయుల పాత్రకు సీఐఐ తాజా సర్వే అద్దం పట్టింది. భారతీయులు, ఇక్కడి మూలాలు కలిగినవారి సంస్థలు.. అగ్రరాజ్య అభ్యున్నతికి దోహదపడుతున్న తీరును ఆవిష్కరించింది. అమెరికాలో ఉన్న 155 భారతీయ సంస్థలు రూ.1.68 లక్షల కోట్ల (22 బిలియన్‌ డాలర్లకుపైగా) పెట్టుబడులు పెట్టాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ తెలిపింది. అమెరికా వ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థలు సుమారు 1.25 లక్షల మందికి ఉద్యోగాలనిచ్చాయని వెల్లడించింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌సహా చాలా దేశాలు అమెరికాకు ఏమీ చేయడం లేదని తరచూ నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వే మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘అమెరికా మట్టిలో భారతీయ మూలాలు 2020’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న ఈ 155 భారతీయ సంస్థల ద్వారా ఉద్యోగాలు పొందిన టాప్‌-5 అమెరికన్‌ రాష్ర్టాల్లో టెక్సాస్‌ (17,578), క్యాలిఫోర్నియా (8,271), న్యూజెర్సీ (8,057), న్యూయార్క్‌ (6,175), ఫ్లోరిడా (5,454) ఉన్నాయి. 

టెక్సాస్‌లో అత్యధికంగా 9.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను భారతీయ కంపెనీలు పెట్టాయి. ఆ తర్వాత న్యూజెర్సీ (2.4 బిలియన్‌ డాలర్లు), న్యూయార్క్‌ (1.8 బిలియన్‌ డాలర్లు), ఫ్లోరిడా (915 మిలియన్‌ డాలర్లు), మసాచుసెట్స్‌ (873 మిలియన్‌ డాలర్లు) రాష్ర్టాలున్నట్లు సర్వే తెలిపింది. భారతీయ సంస్థల దృష్టి ఎక్కువగా న్యూజెర్సీ, టెక్సాస్‌, క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, జార్జియా రాష్ర్టాలపైనే ఉందని కూడా సర్వేలో తేలింది. ఔషధ, లైఫ్‌ సైన్సెస్‌, టెలీకమ్యూనికేషన్స్‌, ఏరోస్పేస్‌, రక్షణ, ఆర్థిక సేవలు, తయారీ, పర్యాటక, ఆతిథ్య, డిజైన్‌, ఇంజినీరింగ్‌, ఆటోమోటివ్‌, ఆహార, వ్యవసాయ, ఇంధన, గనులు, మెటీరియల్స్‌ రంగాలకు చెందిన సంస్థలు తాజా సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 77 శాతం సంస్థలు అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు యోచిస్తుండగా, 83 శాతం కంపెనీలు రాబోయే ఐదేండ్లలో స్థానికులకు ఇంకా ఉద్యోగావకాశాలను కల్పించాలని చూస్తున్నాయి.

‘భారతీయ సంస్థల కోసం మరింత అనువైన వాతావరణాన్ని, అనుకూల విధానాలను అమెరికా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నది. కరోనా వైరస్‌తో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇప్పుడిది ఎంతో ముఖ్యం.’

-చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

‘అమెరికాలో భారతీయ పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్నది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లోనూ భారత్‌ పెట్టుబడులుండటం గమనార్హం’

-తరన్జిత్‌, అమెరికాలో భారత రాయబారి


logo