అమ్మమ్మ, నానమ్మ అనుభవ శిఖరాలు. వాళ్ల్ల జీవన సారాన్ని అర్థం చేసుకుంటే సగం జీవితాన్ని జయించినట్టే! శ్రీదుర్గ, రిశి వర్మ అదే చేశారు. నానమ్మ, అమ్మమ్మలతోపాటు వాళ్లు చేసే పచ్చళ్లనూ ప్రేమించారు. ఊరగాయను ఒక వారసత్వ ఆహారపు అలవాటుగా, ఆరోగ్య దినుసుగా ప్రచారం చేస్తున్నారు.
రాకేశ్ టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. శిరీష్ అట్లాంటాలో ఎంఎస్ చేస్తున్నాడు. దివ్య డల్లాస్‌లో ఉంటుంది. ముగ్గురివీ వేర్వేరు ప్రాంతాలు. కానీ, ముగ్గురికీ ఒక కామన్ పాయింట్.. ఊరగాయ (పచ్చడి). అది వారికి ఎలా చేరింది అనే కదా సందేహం? దివ్య వాళ్ల కజిన్ శృతి బే ఏరియాలో ఉంటుంది. శృతికి ఊరగాయ అంటే ఇష్టం కాబట్టి, వాళ్లమ్మ ఊరగాయ ఆర్డర్ చేసి పంపింది. దానిని శృతి దివ్యకు పంపింది. దివ్య రాకేశ్‌కు పంపింది. ఇలా పచ్చడిని ఒకరికొకరు పంచుకోవడం వల్ల దానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమెరికాలో వందల ఆర్డర్లు బుక్ అవుతున్నాయి. ఇంతకూ ఈ ఊరగాయ వెళ్తున్నది ఎక్కడి నుంచో తెలుసా? హైదరాబాద్ నుంచి. 5జీ జమానాలో వెనుకటి ఆహార సంప్రదాయాన్ని, రుచిని, నాణ్యతను ప్రమోట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు శ్రీదుర్గ, రిషి వర్మ.
మోతాదే విజయ రహస్యం : ‘కస్టమర్లకు నాణ్యమైన పచ్చళ్లు ఇవ్వాలి, వాళ్ల ఆరోగ్యాన్నీ కాపాడాలి’.. ఇదే ‘ఊరగాయ’ ఉద్దేశం. అందుకోసమే, దూరమైనా సరే ఒక్కో ముడి పదార్థం ఒక్కో ఏరియా నుంచి తెప్పిస్తున్నారు. గోంగూర గుంటూరు నుంచీ, మిర్చి, పసుపు నిజామాబాద్ నుంచీ తెప్పిస్తారు. ఐదు స్వయం సహాయక మహిళా గ్రూపులను ఎంపిక చేసుకొని, వారి ద్వారా పచ్చళ్లు తయారు చేయిస్తున్నారు. బేగంపేట కేంద్రంగా ‘ఊరగాయ’ రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మల హస్త నైపుణ్యాలను గుర్తుకుతెచ్చే ఘుమఘుమలతో పచ్చళ్లు చేయడమే తమ విజయ రహస్యమని అంటున్నారు ‘ఊరగాయ’ ఫౌండర్, కో-ఫౌండర్ శ్రీదుర్గ, రిషి వర్మ.
ఊరగాయ బ్రాండ్
శ్రీదుర్గకు నానమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెతో మాట్లాడినంతసేపూ మనసు హాయిగా ఉంటుంది. నానమ్మ చేసిన పచ్చళ్లు అంటే మరీ ఇష్టం. మామిడి, గోంగూర, టమాటా, ఉసిరి, నిమ్మకాయ పచ్చళ్లు బాగా పెట్టేదామె. దుర్గ సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి రిటైల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసింది. రిషి తన క్లాస్మేట్. ఇద్దరూ తరచూ కెరీర్ గురించి చర్చించుకొనేవారు. చదువైపోయాక ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. లాక్డౌన్ సమయంలో కొలువులు వదిలేశారు. తర్వాత ఏం చేద్దాం? అన్న ఆలోచన వచ్చినప్పుడు, దుర్గ పచ్చళ్ల గురించి చెప్పింది. ఆ ఐడియా రిషికి నచ్చింది. దీంతో ‘ఊరగాయ’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. కొద్దిరోజులకే 50 కిలోల పచ్చళ్లు అమ్ముడుపోయాయి. కస్టమర్ల సంఖ్యా పెరిగింది.