13 లక్షల కోట్లు పెరిగిన శ్రీమంతుల సంపద

రూ.12,97,822 కోట్లు... గతేడాది మార్చి నుంచి పెరిగిన దేశంలోని 100 మంది శ్రీమంతుల సంపద
13.8 కోట్ల నిరుపేదలకు రూ.94 వేల చొప్పున ఇవ్వొచ్చన్న ఆక్స్‌ఫామ్
గతేడాది మార్చి నుంచి దేశంలోని 100 మంది టాప్ బిలియనీర్ల సంపద రూ.12,97,822 కోట్లు ఎగబాకింది. ఈ కరోనా కాలంలో పెరిగిన సంపద.. దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు రూ.94,045 చొప్పున ఇవ్వొచ్చని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 25: గతేడాది మార్చి నుంచి దేశంలోని 100 మంది టాప్ బిలియనీర్ల సంపద రూ.12,97,822 కోట్లు ఎగబాకింది. నిరుడు మార్చిలోనే కరోనా వైరస్ దేశాన్ని తాకడం గమనార్హం. అయితే ఈ కరోనా కాలంలో పెరిగిన సంపద.. దేశంలోని 13.8 కోట్ల మంది నిరుపేదలకు రూ.94,045 చొప్పున ఇవ్వడానికి సరిపోగలదని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) దావోస్ ఆన్లైన్ సమావేశాల ప్రారంభ రోజున ‘ది ఇన్‌ఈక్వాలిటీ వైరస్' పేరుతో ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. గడిచిన 100 ఏండ్లలో మునుపెన్నడూ లేనంత ప్రజారోగ్య సంక్షోభాన్ని ఈ కరోనా వైరస్‌తో ప్రపంచం ఎదుర్కొంటున్నదని ఈ సందర్భంగా ఆక్స్‌ఫామ్ అభిప్రాయపడింది. ఇక 1930 నాటి ‘ది గ్రేట్ డిప్రెషన్'తోనే ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభాన్ని పోల్చగలమని వ్యాఖ్యానించింది.
లాక్డౌన్ ప్రభావంలోనూ..
కొవిడ్-19 లాక్డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సైరస్ పూనవాలా, ఉదయ్ కొటక్, అజీమ్ ప్రేమ్‌జీ, సునీల్ మిట్టల్, రాధాక్రిషన్ దమానీ, కుమార మంగళం బిర్లా, లక్ష్మీ మిట్టల్ తదితర బొగ్గు, చమురు, టెలికం, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, రిటైల్ రంగాల్లోని కుబేరుల సంపద గణనీయంగా పెరిగినట్లు వివరించింది. ఈ క్రమంలోనే ధనవంతులు మరింతగా సంపదను పెంచుకున్నారని, పేదవారు ఇంకా పేదరికంలోకి జారుకున్నారని ఆక్స్‌ఫామ్ పేర్కొన్నది. ముఖ్యంగా భారత అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ సంపదలో ఈ కరోనా కాలంలో పెరిగిన సంపదతో.. కొవిడ్-19 దెబ్బకు ఉపాధి కోల్పోయి పేదరికపు అంచుల్లోకి వెళ్లిన 40 కోట్ల అసంఘటిత కార్మికులను కనీసం 5 నెలలపాటు ఆదుకోవచ్చన్నది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ముఖ్యాంశాలు
ఎలాంటి నైపుణ్యం లేని ఓ సాధారణ కార్మికుడి మూడేండ్ల కష్టార్జితం.. గతేడాది మార్చి నుంచి పెరిగిన ముకేశ్ అంబానీ సంపదలో ఒక్క క్షణం ఆదాయానికి సమానం. ఈ లెక్కన ఒక గంటలో ముకేశ్ ఆర్జించిన సొమ్ము కోసం ఆ కూలీ ఏకంగా 10వేల ఏండ్లు శ్రమించాల్సిందే.
సంపన్నులు కరోనా ప్రభావం నుంచి తప్పించుకున్నారు. ఉన్నతోద్యోగులు ఇంటి నుంచే పనిచేశారు. కానీ నిరుపేదలు మాత్రం తమ జీవనోపాధిని కోల్పోయారు. కరోనా పరిస్థితులు రోజు కూలీల జీవితాల్ని తీవ్రంగా దెబ్బతీశాయి. కరోనా దెబ్బకు పోయిన 12.2 కోట్ల ఉద్యోగాల్లో 9.2 కోట్లు అసంఘటిత రంగంలోనివే.
కరోనా కాలంలో పెరిగిన దేశంలోని టాప్ 11 మంది బిలియనీర్ల సంపదపై కేవలం ఒక్క శాతం పన్ను వేసినా.. అలా వచ్చే సొమ్ముతో నిరుపేదలకు చౌకగా మందులను అమ్మే ‘జన ఔషధి’ పథకం కేటాయింపులను 140 రెట్లు పెంచుకోవచ్చు. పదేండ్లపాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నడిపించవచ్చు.
భారతీయ బిలియనీర్ల సంపద ఈ లాక్డౌన్ సమయంలో 35 శాతం ఎగబాకింది. 2009 నుంచి గమనిస్తే 90 శాతం ఎగిసి 422.9 బిలియన్ డాలర్లను తాకింది. ఈ విషయంలో ప్రపంచంలో భారత్‌ది ఆరో స్థానం. అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్‌లు టాప్-5లో ఉన్నాయి.
79 దేశాలకు చెందిన 295 మంది ఆర్థికవేత్తలతో ఆక్స్‌ఫామ్ గ్లోబల్ సర్వేను చేపట్టింది. ఇందులో 87 శాతం మంది తమ దేశంలో కరోనా కారణంగా ప్రజల ఆదాయాల్లో విపరీతంగా అసమానతలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు.
గతేడాది ఏప్రిల్ నెలలో ప్రతీ గంటకు 1,70,000 మంది నిరుద్యోగులయ్యారు. ఈ ఒక్క నెలలోనే 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. కరోనాకు ముందున్న స్థాయితో పోల్చితే మహిళల్లో నిరుద్యోగం రేటు 15 శాతం పెరిగింది.
గ్రామాల్లో కేవలం 4 శాతం మందికే కంప్యూటర్లున్నాయి. 15 శాతం కంటే తక్కువ జనాభాకే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నది.
కరోనా పరిస్థితుల ప్రభావం విద్యా రంగంపై తీవ్రంగా కనిపిస్తున్నది. ప్రధానంగా పేద కుటుంబాల్లోని విద్యార్థులకు చదువే దూరమయ్యే ప్రమాదం నెలకొన్నది.
20 శాతం మంది నిరుపేదల్లో 6 శాతం మందికే మెరుగైన మరుగుదొడ్డి వసతులున్నాయి. దేశ జనాభాలో 59.6 శాతం మంది ఒక గది అంతకంటే తక్కువ స్థలంలోనే జీవిస్తున్నారు.
ఆకలి, ఆత్మహత్యలు, రోడ్డు-రైలు ప్రమాదాలు, అనారోగ్యం, సకాలంలో వైద్యం అందక 300లకుపైగా అసంఘటిత కార్మికులు లాకౌడౌన్ సమయంలో చనిపోయారు. ఒక్క ఏప్రిల్‌లోనే 2,582 మానవ హక్కుల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
‘అసమానతల్ని వెంటనే తగ్గించకపోతే మహా సంక్షోభానికి దారితీయవచ్చు. ఇది అన్ని రంగాలనూ నిర్వీర్యం చేసే ప్రమాదమున్నది. నిరుద్యోగం, ఆకలి చావులు ఆగాలి. ఈ కష్టకాలంలో ప్రజలకు భవిష్యత్తుపై భరోసాను కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే’
-అమితాబ్ బెహర్, ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు