గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 30, 2020 , 01:07:16

ఐటీలో 11వేల మంది ఔట్‌

ఐటీలో 11వేల మంది ఔట్‌

  • ఏప్రిల్‌-జూన్‌లో టాప్‌-5 కంపెనీల్లో భారీగా తగ్గిన ఉద్యోగులు

బెంగళూరు, జూలై 29: దేశీయ ఐటీ రంగ సంస్థలు ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దాదాపు 11వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కరోనా వైరస్‌ ప్రభావం కావచ్చు.. ఆటోమేషన్‌ ఫలితమై ఉండొచ్చు.. మూడు నెలల్లో మాత్రం ఐదు అగ్రశ్రేణి సంస్థల ఉద్యోగుల సంఖ్య 10,962 మేరకు తగ్గిపోయింది. టీసీఎస్‌లో అత్యధికంగా 4,786 మంది ఉద్యోగులు వెళ్లిపోగా, ఇన్ఫోసిస్‌లో 3,138, టెక్‌ మహీంద్రాలో 1,820, విప్రోలో 1,082, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 136 మంది చొప్పున బయటకుపోయారు. ఐటీ సంస్థల ఉద్యోగుల సంఖ్యలో హెచ్చుతగ్గులే ఐటీ రంగ వృద్ధి, పతనానికి ప్రమాణంగా నిలుస్తాయి. తాజా పరిణామాన్నిబట్టి దేశీయ ఐటీ రంగం మందగమనంలో ఉన్నట్లు అర్థమవుతున్నది.

నియామకాల్లేవ్‌

సంస్థాగత నియామకాల్లో మందగమనం ఉన్నట్లు టెక్‌ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్‌ భట్‌ అంగీకరించారు. అయితే రాబోయే త్రైమాసికాల్లో పూర్వ వైభవాన్ని సంతరించుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విప్రో సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ స్పందిస్తూ సంస్థలో ప్రతిభావంతుల కొరత లేదన్నారు. అయితే సంస్థ ఆదాయం పడిపోయినప్పుడు ఇలాంటివి జరుగడం మామూలేనన్నారు. ఇన్ఫోసిస్‌ సీవోవో ప్రవీణ్‌ రావు మాట్లాడుతూ కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరికొంత సమయం పడుతుందన్న ఆయన ఉద్యోగుల కోతలపై స్పందించలేదు. 


logo