శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 25, 2020 , 00:23:23

ఎంఎస్‌ఎంఈల కోసం లక్ష కోట్ల నిధి

ఎంఎస్‌ఎంఈల కోసం లక్ష కోట్ల నిధి

  • కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం లక్ష కోట్ల రూపాయలతో ఓ నిధిని సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, భారీ పరిశ్రమలు ఎంఎస్‌ఎంఈలకు పెద్ద ఎత్తున బకాయి పడ్డాయి. దీంతో ఈ నిధితో ఆ బకాయిలను చెల్లిస్తామని గడ్కరీ శుక్రవారం ఇక్కడ ఓ వెబినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తే.. క్యాబినెట్‌ ముందుకు ఈ ప్రతిపాదన వెళ్తుందన్నారు. ‘రూ.లక్ష కోట్లతో ఓ నిధిని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాం. ప్రభుత్వ వాటాధనంతో దీన్ని బలపరుస్తాం’ అని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు. ఈ ఫండ్‌తో ఎంఎస్‌ఎంఈలకు గొప్ప ఊరట లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన మార్కెట్‌లో నగదు లభ్యత పెరిగేందుకు ఇది దోహదపడగలదన్న ఆశాభావాన్నీ వెలిబుచ్చారు. అయినప్పటికీ ఎంఎస్‌ఎంఈలకు బకాయిపడ్డ మొత్తాలను వెంటనే చెల్లించాలని, అన్ని ప్రభుత్వ శాఖలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోరారు. కరోనా వైరస్‌ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవగా, ఎంఎస్‌ఎంఈల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ క్రమంలోనే సంబంధిత మంత్రిత్వ శాఖ నివారణ చర్యలకు దిగింది.


logo