బయట బ్యూటీ పార్లర్లు తెరిచే ఉన్నా, చాలామంది వెళ్లడానికి భయపడుతున్నారు. ఏం ఫర్వాలేదు, ఇంట్లోనే రకరకాల చిట్కాలతో అందచందాల్ని పెంచుకోవచ్చు. పెద్దగా ఖర్చు చేయాల్సిన పనీ లేదు.
కాఫీ పొడిని కొబ్బరినూనెలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంతో చంకలు, కాళ్లు షేవ్ చేసుకునే ముందు స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది.
ఈ వేసవిలో కొంచెం ఎండ తగిలినా, చర్మంపై సన్ ట్యాన్ వచ్చేస్తుంది. ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, టమాట గుజ్జు వేసి కలపాలి. బయటికి వెళ్లొచ్చిన వెంటనే ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది.
పెరుగులో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
ముఖంపై నల్లటి వలయాలు, మచ్చలు పోవాలంటే వారానికి రెండుసార్లు చక్కెర, తేనె, కాఫీ పొడి కలిపిన మిశ్రమంతో స్క్రబ్ చేసుకోవాలి.
అరటిపండు లేదా బొప్పాయి గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది.