చాక్లెట్ అంటే మెత్తగా కొరికి, తియ్యగా తినే కమ్మని పదార్థమనే మనకు తెలుసు. కానీ ముఖానికి మలాములా, పెదాలకు లిప్‌బామ్‌లా, జుట్టుకు కండిషనర్‌లా, ఒంటికి మాయిశ్చరైజర్‌లా కూడా వాడుకోవచ్చు. కాబట్టే, సౌందర్య నిపుణులకు చాక్లెట్ పట్ల అంత మమకారం. అనేకానేక చాక్లెట్ ఆధారిత ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్నారు. మనం ఇష్టంగా తినే చాక్లెట్‌కు ముడిసరుకైన కొకోవాలో ఎన్నో సుగుణాలున్నాయి.
దీనిలోని ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ కణజాలం మరమ్మతులో సాయపడతాయి. పగుళ్లూ, మచ్చల్లాంటి వాటిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. చర్మానికి రక్త ప్రసరణను పెంచి, ఒంట్లో తేమను నిలిపేందుకు కొకోవాలోని పోషకాలు సాయపడతాయి. మేనిని కాంతిమంతం చేసి, యవ్వనంగా ఉంచేందుకూ సహకరిస్తాయి. ఈ గింజల్లోని ప్రొ ఆంథోసినైడిన్లుగా పిలిచే వర్ణద్రవ్యాలు వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడతాయి. జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
ఇందులోని ప్రొటీన్, విటమిన్-ఎ, రిబోఫ్లేవిన్, థయా
మిన్లు కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే హెయిర్ మాస్కుల్లోనూ కొకోవా పొడిని వాడుతున్నారు. సబ్బులకూ చాక్లెట్ జోడిస్తున్నారు. ఇక, చాక్లెట్ తింటే మూడ్ బాగుంటుందని మనకు తెలిసిందే! ముందస్తు చాక్లెట్ డే శుభాకాంక్షలు (జూలై 7 చాక్లెట్ డే).