బుధవారం 30 సెప్టెంబర్ 2020
Beauty-tips - Sep 16, 2020 , 00:17:30

పుట్టుమచ్చ పులిపిరైంది.. ఏం చేయాలి?

పుట్టుమచ్చ పులిపిరైంది.. ఏం చేయాలి?

నాకు పై పెదవికి పైన ఒక పుట్టుమచ్చ ఉండేది. అది పెద్దగా అయి.. ఇప్పుడు పులిపిరి లాగా మారింది. దానివల్ల మొన్నటి వరకూ బ్యూటీ స్పాట్‌ లాగా కనిపించిన పుట్టుమచ్చ ఇప్పుడు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. ముఖం మీద కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది. ఇలా పుట్టుమచ్చ పులిపిరి లాగా ఎందుకు అవుతుంది? దీన్ని తీసేయొచ్చా?- నీలిమ, మేడ్చల్‌

సాధారణంగా పుట్టుమచ్చలు నల్లని చుక్కలాగా ఉంటాయి. ఎప్పుడైనా ఏ వయసులో అయినా వాటి పరిమాణం పెరగవచ్చు. కొంతమందికి హార్మోన్ల మార్పుల వల్ల, మరికొందరికి వయసుతోపాటు పుట్టుమచ్చల సైజు పెరుగుతుంది. కానీ, పెరిగే ప్రతి పుట్టుమచ్చ గురించి కంగారు అవసరం లేదు. పుట్టుమచ్చ చాలా వేగంగా పెరిగి, దానిలో పుండులాగా ఏర్పడినప్పుడు ఆలోచించాలి.  దురద ఉన్నా సమస్య అనుకోవచ్చు. అంతేగానీ నెమ్మదిగా పెరిగే పుట్టుమచ్చ గురించి కంగారుపడనక్కర్లేదు. మీకు ఆ పుట్టుమచ్చ పులిపిరి లాగా అనిపిస్తున్నదని అంటున్నారు. అయితే కొన్ని పుట్టుమచ్చలు బొడిపె లాగా కూడా కనిపిస్తాయి.  చూడటానికి ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు దానికి చికిత్స చేయవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ, లేజర్‌లతో తీసేయవచ్చు. కొన్నిసార్లు సర్జరీ అవసరం అవుతుంది. సైజు 0.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నప్పుడు లేజర్‌ చికిత్స సరిపోతుంది. అంతకన్నా పెద్ద సైజులో ఉంటే లేజర్‌ చేసి వదిలేస్తే అది రంధ్రం లాగా కనిపిస్తుంది. మచ్చ ఏర్పడుతుంది. అందువల్ల గాయాన్ని సర్జికల్‌ మెథడ్‌ ద్వారా మూసివేయాలి. సర్జరీ అంటే భయం అవసరం లేదు. చాలా చిన్న సర్జరీ. తర్వాత చర్మంలో కలిసిపోతుంది. డెర్మోస్కోపీ చేసి మీకేది సరిపోతుందో ఆ చికిత్స చేస్తారు. మీకు దగ్గరలోని చర్మవైద్యులను కలవండి. 


డాక్టర్‌ స్వప్నప్రియ
సీనియర్‌ కన్సల్టెంట్‌ 
డెర్మటాలజిస్టు
కేర్‌ హాస్పిటల్స్‌
హైదరాబాద్‌


logo