సోమవారం 06 జూలై 2020
Beauty-tips - Jun 30, 2020 , 00:06:13

మేం ‘ఫెయిర్‌' కాదా..

మేం ‘ఫెయిర్‌' కాదా..

 సినిమాలే కాదు.. వాణిజ్య ప్రకటనలు కూడా యువత మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందులోనూ ఫెయిర్‌నెస్‌ క్రీముల కంపెనీలు ముందు వరసలో ఉంటాయి. అనేక సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు నల్లగా ఉండే వారిని తక్కువ చేసి చూపిస్తూ.. తెల్లగా ఉండేవారే అన్నింట్లోనూ ముందుంటారని అర్థం వచ్చేలా యాడ్స్‌ గుప్పిస్తున్నాయి.   ఇలాంటి ప్రకటనల్ని చూసిన చందన.. చాలామంది ఆడపిల్లల్లా.. ఆ ఉత్పత్తులను వాడి తెల్లగా మారిపోవాలని అనుకోలేదు. ‘అసలు నల్లగా ఉంటే తప్పేంటి?.. ఈ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ వాడి తెల్లగా మారాల్సిన అవసరం ఏంటి?’ అని తననుతాను ప్రశ్నించుకుంది. తయారీ దారులనూ ప్రశ్నించింది. నల్లగా ఉండే వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చేలా రూపొందిస్తున్న ఇలాంటి ప్రకటనలను నిషేధించాలనే డిమాండ్‌తో సామాజిక ఉద్యమానికి తెరలేపింది. జనాలను తప్పుదోవ పట్టిస్తున్న ఫెయిర్‌నెస్‌ క్రీముల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావద్దంటూ ‘ఆల్‌ షేడ్స్‌ ఫర్‌ లవ్లీ’ పేరిట ఓ పిటీషన్‌ రాసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. తనకు మద్దతు తెలిపేవారంతా ఈ పిటీషన్‌పై సంతకం చేసి, మరికొందరికి ఫార్వర్డ్‌ చేయాలని కోరింది. రెండు వారాల్లోనే ఆ పిటీషన్‌పై 15వేల మంది సంతకం చేయడంతోపాటు.. సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యింది.

చందనతోపాటు అనేక దేశాల మహిళలు సోషల్‌ మీడియాలో ఉద్యమాలు నడిపించారు. ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ని ఉత్పత్తి చేసే యునిలీవర్‌ సంస్థకు కూడా ఈ  సెగ తగిలింది. వెంటనే దిగొచ్చింది. అప్పటికే, వ్యవహారం చాలా దూరం వెళ్లడంతో  ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరును మారుస్తామని ప్రకటించింది. అందులోని ‘ఫెయిర్‌' అనే పదాన్ని తొలగిస్తున్నట్టు చెప్పింది. అందానికి సంబంధించి తమ ఉత్పత్తుల బ్రాండింగ్‌ ఇక నుంచి కొత్తగా ఉంటుందని, అన్ని రకాల వర్ణాలను ప్రోత్సహించేలా ప్రకటనలు రూపొందిస్తామని ప్రకటించింది. దీంతో చందన లక్ష్యం నెరవేరింది.  ‘నల్లగా ఉన్నంత మాత్రాన మేం మనుషులం కాకుండా పోతామా..? మా వ్యక్తిత్వం మాకు లేకుండా పోతుందా?’ అని చందన ప్రశ్నిస్తున్నది. సినిమాల్లో, ప్రకటనల్లో  తెల్లగా ఉండేవారికే విలువ ఇస్తున్నారని, వర్ణ వివక్షను నిర్మూలించడానికే ఈ ఉద్యమానికి తెరలేపానని అంటున్నది. 

1975లో వచ్చిన ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’.. మన దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ‘తెల్లగా ఉండటమే గొప్ప’ అనే కాన్సెప్ట్‌తో అనేక వాణిజ్య ప్రకటనలను గుప్పించి, తన ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకున్నది. ‘కలరిజం’కు వ్యతిరేకంగా  చందన హిరణ్‌ అనే యువతి చేపట్టిన సామాజిక ఉద్యమం.. ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరునే మార్చేలా చేసింది.logo