ఆదివారం 31 మే 2020
Beauty-tips - Apr 16, 2020 , 01:39:06

మెరిసే పెదవుల కోసం

మెరిసే పెదవుల కోసం

 
 ముఖానికి అందాన్నిచ్చే పెదవులు వాతావరణ మార్పుల వల్ల తరచూ పొడిబారిపోతాయి. ఈ సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు పెదవుల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గులాబి రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముళ్ళలా మారి ఇబ్బందిపెడతాయి. పొడి చర్మం ఉన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కోమలమైన, మెరిసే పెదవులు కోరుకొనే అతివలంతా ఈ కింది చిట్కాలు పాటించండి ..
బిరుసెక్కిన పెదాలకు లిప్‌స్టిక్‌ రాసే ముందు పాలలో ముంచిన దూదితో పెదాలను తుడిచి లిప్‌స్టిక్‌ రాస్తే పెదవులు నిగారించినట్లు కనిపించటమే గాక ఎక్కువసేపు ఆ మెరుపు ఉంటుంది.రోజూ పెదవులకు మీగడ రాసుకుంటే సున్నితంగా,మృదువుగా మారతాయి. పచ్చి బంగాళ దుంప ముక్కల్నిపెదవులకు రాసుకుంటే పెదవులు మెత్తబడటమే గాక నల్లని పెదవులు సైతం గులాబీ రంగుకు మారతాయి.
ఆరిన పెదవులను తరచూ నాలుకతో తడపటం వల్ల పెదవులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది గానీ దీనివల్ల పెదవులు వేగంగా తేమను కోల్పోయి సున్నితత్వాన్ని కోల్పోతాయి. వేసవిలో ఈ మార్పు మరింత వేగంగా జరిగి పెదవులు బాగా పగుళ్లిస్తాయి. అందుకే పెదవులను నాలుకతో తరచూ తడుపుకోవటం మానుకోవాలి. మిగిలిన చర్మంపై ఉన్నట్టుగా పెదాలపై ఎలాంటి తైల గ్రంథులు ఉండవు గనుక త్వరగా పొడిబారి బిరుసెక్కుతాయి. వేసవిలో ఈ పరిస్థితిని నివారించాలంటే లేత కీరదోసముక్కతో తరచూ రుద్ది తగినంత తేమను అందేలా చూడాలి.
పొడిబారి బిరుసెక్కిన పెదవులకు తాజా కలబంద గుజ్జు రాసి తేలిగ్గా మర్దన చేస్తే పెదవులకు తగినంత తేమ సమకూరి మెత్తబడతాయి. బిరుసెక్కిన పెదాలకు రాత్రి నిద్రకు ముందు కొద్దిగా పేరైన నెయ్యి రాసి మర్దన చేస్తే ఉదయానికి పెదాలు మృదువుగా మారి మెరుస్తాయి. గ్రీన్ టీ బాగ్ ను గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు ముంచి తీసి బిరుసెక్కిన పెదాల మీద ఉంచితే గొప్ప ఉపశమనంతో బాటు పెదాలు మెత్తబడతాయి.


logo