సోమవారం 06 ఏప్రిల్ 2020
Beauty-tips - Feb 24, 2020 , 22:54:44

ఫిబ్రవరి - ఎఎండి అవేర్‌నెస్‌ మాసం

ఫిబ్రవరి - ఎఎండి అవేర్‌నెస్‌ మాసం
  • మసక చూపుపై అశ్రద్ధ వద్దు!

వృద్ధాప్యం రాగానే రకరకాల సమస్యలు ముంచుకువస్తాయి. కొన్ని సమస్యలు వయసురీత్యా వచ్చే మార్పులే కదా అనుకుంటే ప్రమాదంలో పడేస్తాయి. అలాంటి సమస్యల్లో ఒకటి మాక్యులర్‌ డీజనరేషన్‌. వయసు పెరిగినవాళ్లలో అంధత్వానికి కారణమయ్యే అతి సాధారణ వ్యాధి ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డీజనరేషన్‌ (ఎఎండి). ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి ఇది మూడో కారణం. 74 శాతం మంది ఈ ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డీజనరేషన్‌ (ఎఎండి)తో బాధపడుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. 65 ఏళ్లు దాటినవాళ్లలో 10 శాతం, 75 ఏళ్లు దాటినవాళ్లలో 25 శాతం మందిని ఇది ప్రభావితం చేస్తోంది. 2040 కల్లా 288 మిలియన్ల ఎఎండి పేషెంట్లు అవుతారని అంచనా. అందుకే ఫిబ్రవరి నెలను ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డీజనరేషన్‌ అవగాహనా మాసంగా పరిగణిస్తున్నారు. ఈ సందర్భంగా ఎఎండి గురించి..


వయసు పెరిగినవాళ్లలో ఎక్కువగా కనిపించే సమస్య ఎఎండి లేదా మాక్యులర్‌ డీజనరేషన్‌. కేంద్రీయ దృష్టిలోపానికి ఎఎండి ప్రధాన కారణం. ఈ మాక్యులర్‌ డీజనరేషన్‌ వల్ల దృష్టి స్పష్టంగా ఉండదు. మసకగా కనిపించడం వల్ల యాక్సిడెంటల్‌గా పడిపోతుంటారు. ఇలాంటప్పుడు తీవ్రమైన దెబ్బలు, గాయాలు తగిలే అవకాశం ఉంది. దృష్టిలోపం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా పడిపోతుంటారు. కింద పడి గాయాలు కావడం వల్ల మరణానికి గురయ్యేవాళ్లు కూడా ఉంటారు. 


ఎఎండి అంటే?

కంటిలోని రెటీనాకు మధ్య భాగంలో ఉండే నిర్మాణమే మాక్యులా. ఈ మాక్యులా కింద రక్తనాళాలు అసాధారణంగా పెరగడం వల్ల వచ్చే సమస్యే ఎఎండి. ఇలా పెరిగిన రక్తనాళాలు లీక్‌ అయి, రక్తం, ద్రవం అంతా రెటీనాలోకి వస్తుంది. దాంతో సెంట్రల్‌ విజన్‌ డ్యామేజీ అవుతుంది. దీని లక్షణాలు ఏంటంటే:

మసకగా, ముద్దముద్దగా కనిపిస్తుంది

రంగులు గుర్తుపట్టడం కష్టమవుతుంది. 

కలర్‌ సెన్సిటివిటీ పోతుంది. 

చూపులో నల్లని మచ్చలు వస్తుంటాయి. 

నిలువుగా చారల్లా కనిపిస్తుంటాయి. 

దూరంగా చూడడం కష్టమవుతుంది. 


చాలా సందర్భాల్లో ఈ ఎఎండి లక్షణాలను వయసురీత్యా కలిగే మార్పులుగా పొరబడి నిర్లక్ష్యం చేస్తుంటారు. దృష్టి మందగిస్తున్న కొద్దీ దాన్ని పట్టించుకోకుండా అడ్జస్ట్‌ చేసుకుంటూ పోతే అది కాస్తా మొత్తం జీవన నాణ్యతపై ప్రభావం చూపిస్తుంది. సరిగా కనిపించకపోవడం వల్ల అకస్మాత్తుగా కింద పడిపోతుంటారు. ఎవరి సహాయం లేకుండా తమకు తాముగా రోజువారీ పనులు చేసుకోలేరు. దానివల్ల డిప్రెషన్‌కి లోనవుతారు. అందువల్ల ఎఎండిని తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరం. అందుకే వెంటనే కంటి డాక్టర్‌ను కలవాలి. చికిత్స మొదలుపెట్టిన తరువాత కూడా ప్రతి ఆరు నెలలకోసారి చెకప్స్‌కి వెళ్లాల్సి ఉంటుంది. 


చికిత్స ఏంటంటే...?

ఎఎండికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఎఎండిని రివర్స్‌ చేయవచ్చు. వ్యాధి పెరిగే వేగాన్ని తగ్గించవచ్చు. అయితే వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే ఇవి అంత బాగా పనిచేస్తాయి. మనదేశంలో ఎఎండికి లేజర్‌ ఫొటో కోయాగ్యులేషన్‌, యాంటి వాస్కులర్‌ ఎండోథీలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ (యాంటి-విఇజిఎఫ్‌) ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. యాంటి వాస్కులర్‌ ఎండోథీలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ థెరపీ లేదా యాంటి-విఇజిఎఫ్‌ థెరపీ ద్వారా రక్తనాళాల ఎండోథీలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ను బ్లాక్‌ చేసే మందులను ఇస్తారు. ఏజ్‌ రిలేటెడ్‌ మాస్కులర్‌ డీజనరేషన్‌ కోసమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సలో కూడా యాంటి-విఇజిఎఫ్‌ చికిత్సను వాడుతారు. ఈ చికిత్స ద్వారా మందులను ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. లేజర్‌ ఫొటో కోయాగ్యులేషన్‌, యాంటి-విజిఎఫ్‌ రెండింటి కాంబినేషన్‌లో కూడా చికిత్స అందించవచ్చు. ఇది కూడా ఇంజెక్షన్‌ రూపంలోనే ఇస్తారు. కంటిలోని మాక్యులా లోపల ఉండే రక్తనాళాల్లో మార్పులను తగ్గించేలా యాంటి-విఇజిఎఫ్‌ థెరపీ పనిచేస్తుంది. ఈ చికిత్స దృష్టిలోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేగాకుండా తొందరగా సకాలంలో చికిత్స చేస్తే కోల్పోయిన దృష్టిని తిరిగి తెస్తుంది కూడా. అందుకే వృద్ధులు తమకు ఏమాత్రం దృష్టిలో తేడా వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే కంటివైద్యుడిని సంప్రదించాలి. 


ఎఎండి ఉన్నవాళ్లు యాక్సిడెంట్‌ 

ఫాల్స్‌ను నివారించడానికి చిట్కాలు

ఎఎండి ఉన్న వాళ్ల కుటుంబ సభ్యులు తమ ఇంట్లో అంతా సురక్షితమైన పరిసరాలు ఉండేట్టుగా చూసుకోవాలి. వాళ్లు ఒకవేళ కింద పడ్డా గాయాలు అయ్యేందుకు ఆస్కారం లేనివిధంగా ఇల్లును ఉంచాలి. ఇంట్లో ఏది తగిలి కింద పడతామో అనే భయం లేకుండా ఫ్రీగా తిరిగేలా మెయిన్‌టెయిన్‌ చేయాలి. తన ఫ్యామిలీ సపోర్టు ఉందంటే వాళ్లకు కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. 

కింద పడిపోవడాన్ని నివారించడానికి వ్యాయామం ద్వారా శరీరాన్ని శక్తివంతం చేయడం. దీనివల్ల కింద పడకుండా బ్యాలెన్స్‌ చేసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. 

ఇంట్లో మసకగా కూడా చీకటి ఉండకుండా ఎప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవడం. 

ఇంట్లో ఉన్న టేబుళ్లు, స్టూళ్లు, ఇతర సామాన్లు పేషెంట్‌కు అడ్డుగా ఉండకుండా సర్దుకోవాలి. 

జారుడుగా ఉండే చెప్పులు ధరించవద్దు. హీల్స్‌ కూడా వాడొద్దు. అర అంగుళం కన్నా ఎక్కువ హీల్‌ ఉన్నవి వేసుకుంటే పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ల సైజుకు సరిగ్గా సరిపోని చెప్పులు కూడా వేసుకోవద్దు. 


డాక్టర్‌ రాజ నారాయణన్‌

సెక్రటరీ, విట్రియో రెటినల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా


logo