స్వచ్ఛమైన బంగారానికి సాగే గుణం ఉంటుంది. ఒక ఔన్సు (28.3 గ్రా) బంగారాన్ని దారంగా యాభై మైళ్ల దూరం వరకు సాగదీయవచ్చు. భూమ్మీద ఉన్న బంగారాన్నంతా సాగదీస్తే.. ఆ దారంతో భూగ్రహాన్ని కోటీ పదిలక్షల సార్లు చుట్టొచ్చట.
పుత్తడి అంటే ఇష్టపడని వాళ్లుంటారా! ముఖ్యంగా, మనదేశంలో ఆడవాళ్లకు బంగారంపై మక్కువ అంతా ఇంతా కాదు. ఒళ్లంతా నగలు దిగేసుకున్నా.. పిసరంత పసిడి కనిపిస్తే దానికీ చోటివ్వడానికి సిద్ధంగా ఉంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొనేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే.. బంగారం మగువల జీవితాల్లో ప్రధాన భాగం, పెట్టుబడి దారుల తొలి ఎంపిక. పైడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
అచ్చమైన బంగారం పసుపుపచ్చని రంగులో ఉంటుంది. కానీ, పసిడిని గట్టిపర్చడానికి అందులో కలిపే లోహాలను బట్టి దాని రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ గానీ, పలాడియం లోహాన్ని గానీ కలుపుతారు. రాగిని కలపడం వల్ల పుత్తడి ఎరుపు మెరుపులు సంతరించుకొని రోజ్గోల్డ్గా మారుతుంది. మార్కెట్లో గ్రీన్‌గోల్డ్ కూడా అందుబాటులో ఉంది. వెండి, జింక్, కాడ్మియం ఈ లోహాల్లో దేంతోనైనా జతగూడినప్పుడు బంగారం ఆకుపచ్చ ఛాయను పొదుగుకుంటుంది. బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడానికి క్యారెట్ కంటెంట్‌ని 24 భాగాలుగా చేసి దాన్ని వందతో గుణిస్తారు. అలా వచ్చే శాతాన్ని బట్టి బంగారం స్వచ్ఛతను కొలుస్తారు.