శనివారం 30 మే 2020
Beauty-tips - Jan 08, 2020 , 16:08:06

చ‌ర్మం మృదువుగా ఉండాలంటే.. ఈ జ్యూస్‌లు రోజూ తాగాలి..!

చ‌ర్మం మృదువుగా ఉండాలంటే.. ఈ జ్యూస్‌లు రోజూ తాగాలి..!

తాజా కూరగాయలు లేదా పండ్లతో తయారు చేసే జ్యూస్‌లను తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. అనారోగ్య సమస్యలను తరిమేస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం అనేక మంది అనేక రకాల కూరగాయలు లేదా పండ్ల రసాలను తాగుతుంటారు. అయితే ఈ కాలంలో తలెత్తే చర్మ సమస్యలకు మాత్రం కింద చెప్పిన జ్యూస్‌లను తాగాల్సిందే. ఎందుకంటే ఈ జ్యూస్‌లను తాగితే చర్మ ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. పగుళ్లు పోతాయి. మరి ఈ సీజన్‌లో మనం నిత్యం తాగాల్సిన జ్యూస్‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. క్యారెట్ జ్యూస్


క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన కాంతిని తెస్తుంది. చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలను పోగొడుతుంది. చర్మం పొడిబారకుండా, దద్దుర్లు ఏర్పడకుండా చూస్తుంది.

2. కీరదోస జ్యూస్


కీరదోసలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో 90 శాతం ఉండేది నీరే. దీంతో కీరదోసను మనం తేలిగ్గా జీర్ణం చేసుకోగలుగుతాం. ఇక దీంట్లో ఉండే విటమిన్ కె, ఎ, సి లు చర్మానికి ఎప్పుడూ తేమను అందిస్తాయి. ఫలితంగా పొడిచర్మం కాస్తా మృదువుగా, తేమగా మారుతుంది.

3. టమాటా జ్యూస్


టమాటాల్లో లైకోపీన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఎండవల్ల కందిపోయిన చర్మాన్ని బాగు చేస్తుంది. చర్మం సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. దీంతో చర్మం ఎప్పుడూ కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. టమాటాల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మ సౌందర్యాన్ని పరిరక్షిస్తాయి.

4. బీట్‌రూట్ జ్యూస్


బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, సి, కె, కాపర్, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మం ఫెయిర్‌గా మారుతుంది.

5. లెమన్ జ్యూస్


నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇది పీహెచ్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. దీంతో యంగ్‌గా కనిపిస్తారు. చర్మం ఫెయిర్‌గా మారుతుంది.

6. యాపిల్ జ్యూస్


రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చనే విషయం తెలిసిందే. అలాగే రోజూ యాపిల్ జ్యూస్‌ను తాగితే పొడి చర్మం తేమగా మారుతుంది. మృదువుగా తయారవుతుంది. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. కణాలను నాశనం కాకుండా రక్షిస్తాయి. దీంతో చర్మ సౌందర్యం పెరిగి యవ్వనంగా కనిపిస్తారు.


logo