బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Jan 08, 2020 , 16:16:41

పెదవుల సంరక్షణకు ఇంటి చిట్కాలు..!

పెదవుల సంరక్షణకు ఇంటి చిట్కాలు..!

చలికాలంలో చర్మంతోపాటు పెదవులు కూడా పగులుతుంటాయి. కొందరికి పెదవులు మరీ బాగా పగులుతాయి. దీంతో అలాంటి వారి పెదాలను చూస్తే అంద విహీనంగా కనిపిస్తాయి. అలాంటి వారు కింద సూచించిన పలు చిట్కాలను పాటిస్తే పెదవుల పగుళ్లను తగ్గించుకోవచ్చు. దీంతో పెదవులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరి పెదవుల సంరక్షణకు పాటించాల్సిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. తేనెలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి అందులో కొన్ని గులాబీ రేకులను వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకోవాలి. 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే పెదవులు పగలకుండా ఉంటాయి.

2. ఒక టీస్పూన్ పసుపును, అంతే మోతాదులో పాలను తీసుకుని కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని పెదవులకు రాయాలి. 5 నిమిషాల తరువాత లిప్ బామ్ రాసి మళ్లీ కొంచెం సేపు ఆగి ఆ తరువాత కడిగేస్తే పెదవుల పగుళ్లు పోయి, పెదవులు నిగారింపును పొందుతాయి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. చక్కెర, నిమ్మరసంలను సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని పెదవులకు రాయాలి. 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే పెదవులు పగలకుండా చూసుకోవచ్చు.

4. క్యారెట్ లేదా బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా తేనె, ఆలివ్ ఆయిల్‌లను కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదవులకు రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తే పెదవులు సురక్షితంగా ఉంటాయి.

5. స్ట్రాబెర్రీలను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలిపితే అది లిప్ బామ్‌లా పనిచేస్తుంది. దాన్ని ఉదయం, సాయంత్రం పెదవులకు రాస్తే పెదవులు పగలడం ఆగుతుంది. పెదవులు మృదువుగా మారుతాయి.


logo