బుధవారం 03 మార్చి 2021
Badradri-kothagudem - Feb 23, 2021 , 03:14:42

రుణాల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌

రుణాల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌

కొత్తగూడెం అర్బన్‌, ఫిబ్రవరి 22: స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం సకాలంలో రుణాలను అందించి మహిళల ఆర్థ్ధికాభివృద్ధికి కృషి చేస్తోంది. ప్రతి ఏడాది రుణ లక్ష్యాన్ని నిర్ణయించి మహిళలకు రుణాలను అందించి వ్యాపారాభివృద్ధికి పాటుపడుతోంది. 75 శాతం మహిళా సంఘాలు నెల నెలా రుణాలను తిరిగి చెల్లిస్తూ, ఆర్థికాభివృద్ధి వైపు పురోగమిస్తున్నాయి.

రూ.4.5 కోట్ల బకాయిలు

కొన్ని సంఘాలు మాత్రం రుణ వాయిదాల చెల్లింపులో వెనుకబడుతున్నాయి. ఫలితంగా ఆయా సంఘాలు మరుసటి ఏడాది రుణాలు పొందేందుకు అర్హత సాధించలేకపోతున్నాయి. వీటి మొత్తం బకాయిలు రూ.4.5 కోట్లు ఉన్నాయి. ఈ సంఘాలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో సెర్ఫ్‌, మెప్మా అధికారులు కృషి చేస్తున్నారు. రుణ వాయిదాలు చెల్లించకపోతే జరిగే నష్టాలను, సక్రమంగా చెల్లిస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. వాయిదాలను సకాలంలో చెల్లిస్తే మరుసటి ఏడాది ఎక్కువ మొత్తం రుణాలను తీసుకోవచ్చని, లేనట్లయితే సంఘాలే నష్టపోతాయని వివరిస్తున్నారు. బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఈ నెల చివరి నాటికి సుమారు రూ.2.5కోట్లు వసూలు చేసేందుకు రంగంలోకి దిగారు. మెప్మా పరిధిలో కొత్తగూడెం(భరతమాత ఎస్‌ఎల్‌ఎఫ్‌)లో 102 గ్రూపులు రూ.54లక్షలు, పా ల్వంచ(అమ్మదీవెన ఎస్‌ఎల్‌ఎఫ్‌) 45 గ్రూపులు రూ.19.35లక్షలు, మణుగూరు(క్రాంతి ఎస్‌ఎల్‌ఎఫ్‌) 55 గ్రూపులు రూ.55లక్షలు, ఇల్లెందు(స్త్రీ శక్తి ఎస్‌ఎల్‌ఎఫ్‌) 130 గ్రూపులు రూ.38లక్షలు,  సెర్ఫ్‌ పరిధిలో  బూర్గంపాడు 111 సంఘాలు రూ.49లక్షలు, ఇల్లెందు రూ.39 లక్షలు,  అశ్వారావుపేట 100 సంఘాలు రూ.25లక్షలు, జూలూరుపాడు 73 సంఘాలు రూ.22లక్షల బకాయి ఉన్నాయి.

సకాలంలో చెల్లించాలి 

స్త్రీ నిధి  రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తేనే మరుసటి ఏడాది ఎక్కువ మొత్తంలో రుణాలను పొందవచ్చు. రుణ వాయిదాలు చెల్లించకుండా కాలయాపన చేస్తే సంఘాలే నష్టపోతాయి. ప్రభుత్వం ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలి.

- కె.సుమన్‌, స్త్రీ నిధి రీజినల్‌ మేనేజర్‌

VIDEOS

logo