గురువారం 25 ఫిబ్రవరి 2021
Badradri-kothagudem - Jan 26, 2021 , 03:43:53

ఏప్రిల్‌ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్‌ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు

  • 21న శ్రీసీతారామ కల్యాణం
  • 22న రామయ్య మహా పట్టాభిషేకం
  • ప్రకటించిన ఆలయ వైదిక కమిటీ

సారపాక, జనవరి 25: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 13 నుంచి 27వ తేదీవరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరపాలని వైదిక కమిటీ సోమవారం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను దేవస్థానం ఈవో బానోతు శివాజీ ప్రభుత్వానికి విన్నవించారు. ఏప్రిల్‌ 13 ఉగాది నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ రోజే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు కలపనున్నారు. 13న చైత్రశుద్ధ పాడ్యమి ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మూలమూర్తుల స్నపన తిరుమంజనం, ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం నూతన పంచాగ శ్రవణం ఆస్థానం, శ్రీస్వామి వారికి తిరువీధి సేవ, 17న మృత్సంగ్రహణం, వాస్తుహోమం, అంకురార్పణ, 18న భగవత్‌ రామానుజజయంతి, గరుఢ ధ్వజపట లేఖనం, ఊరేగింపు నిర్వహిస్తారు. 19న ధ్వజారోహణం, 20న యాగశాలలో చతుస్థానార్చనలు నిర్వహించి వేడుకగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 21న శ్రీసీతారాములకు అభిజిత్‌లగ్నంలో తిరుకల్యాణోత్సవం నిర్వహించి 22న మహాపట్టాభిషేకం, అదేరోజు రాత్రి రథోత్సవం చేయనున్నారు. 23న వేదాశీర్వచనం, 24న కల్యాణ రాముడి విహారం, 25న రాత్రి బంగారు ఊయలలో స్వామివార్లకు ఊంజల్‌ సేవ చేస్తారు. 26న వసంతోత్సవం, సుదర్శనహోమం, గజవాహన సేవ, 27న పవిత్ర గోదావరిలో చక్రతీర్థం, ధ్వజారోహణం, దేవతోద్వాసన, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగంతో పూర్ణాహుతి అనంతరం బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.

నిత్య కల్యాణాలు రద్దు...

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 17 నుంచి 27వ తేదీవరకు ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణాలను రద్దుచేస్తున్నట్లు వైదిక కమిటీ ప్రకటించింది. 17వ తేదీ నుంచి 27వ తేదీవరకు భద్రాద్రి రామయ్యకు నిర్వహించే దర్బారు సేవలు, పవళింపు సేవలు ఉండవని వైదిక కమిటీ తెలిపింది. 

VIDEOS

logo