‘కరోనా’కు ఎదురొడ్డి..

- స్ఫూర్తిగా నిలిచారు
- కొవిడ్ సమయంలో ధైర్యసాహసాలతో సేవలందించారు..
- మొదటి దశలో వైద్య సిబ్బంది కోసం వ్యాక్సిన్‌కు అనుమతి
- కరోనా టీకా ప్రారంభోత్సవంలో భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి
- భయపడకండి.. టీకా వచ్చేసింది: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం, జనవరి 16 : కరోనా విజృంభణ రోజుల్లో ప్రాణాపాయం ఉన్నప్పటికీ లెక్కచేయకుండా వైద్య సిబ్బంది తమ విలువైన సేవలందించారని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. అందుకని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి దశలో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతిచ్చినట్లు చెప్పారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఢిల్లీ నుంచి ప్రధాని ప్రసంగ పాఠాన్ని ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఎల్ఈడీలో వీక్షించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ సరళ మనందరికీ మార్గదర్శిగా ఉండేందుకు ముందుగా టీకా తీసుకున్నారని అన్నారు. ఆమెను అభినందించారు. వ్యాక్సిన్ వేసేందుకు శిక్షణ పొందిన సీనియర్ ఏఎన్ఎం శాంతిప్రియ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రం నుంచి 30 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తం 120 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. ఈ రోజు కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందికి తిరిగి 28 రోజుల తరువాత అదే వ్యాక్సిన్‌ను అందజేస్తామని అన్నారు. అదనపు కలెక్టర్ అనుదీప్, ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆర్ఎంవో రవిబాబు, వ్యాక్సినేషన్ స్పెషల్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, ఉప వైద్యాధికారి డాక్టర్ పోటు వినోద్, కౌన్సిలర్ బండారి రుక్మాంగధర్ తదితరులు పాల్గొన్నారు.
కరోనాకు భయపడకండి..: ఎమ్మెల్యే వనమా
ఇక కరోనాకు భయపడవద్దని, టీకా వచ్చేసిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కానీ అలసత్వం వహించకుండా కరోనా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 3వ వార్డు పాత కొత్తగూడెం యూపీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మొదటిగా ఆశా వర్కర్ డీ.సుజాతకు డాక్టర్ల సమక్షంలో దగ్గర ఉండి టీకా మందు వేయించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, కాంపెల్లి కనకేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.