సంక్రాంతి నవకాంతి

ఆనందోత్సాహాలతో భోగి పండుగ..
నేడు మకర సంక్రాంతి.. రేపు కనుమ వేడుకలు
పల్లె, పట్నంలో సందడి
పల్లె, పట్నం లోగిళ్లు రంగ వల్లులు.. గొబ్బెమ్మలు, నవధాన్యాలతో కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా హరిదాసు కీర్తనలు.. బసవన్నల విన్యాసాలు, గాలి పటాలతో సందడి కనిపిస్తున్నది. జిల్లావ్యాప్తంగా మూడురోజుల పాటు సంక్రాంతి పండుగను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం ఆనందోత్సాహాల మధ్య భోగి వేడుకలు నిర్వహించారు. గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. -ఖమ్మం కల్చరల్ జనవరి13
ఖమ్మం కల్చరల్, జనవరి13 : ముంగిళ్లలో సప్తవర్ణాల రంగవల్లులు.. ఆకాశంలో ఎగురుతున్న గాలి పతంగులు.. ధాన్యపు రాశులతో సంక్రాంతికి శోభ చాటాయి. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలంతా పట్టణాల నుంచి పల్లెలకు పయనమయ్యారు. బుధవారం భోగి పర్వదినాన్ని భోగి మంటలు వెలిగించి చెడును పారదోలారు.
కమనీయం.. గోదా రంగనాథుల కల్యాణం..
పవిత్ర ధనుర్మాసోత్సవంలో భాగంగా భోగి పర్వం నాడు పలు ఆలయాల్లో కనుల పండువగా గోదా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆండాళ్ తల్లి రంగనాథుడి కోసం నెల రోజుల పాటు తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి, స్వామిని వరించే కమనీయ ఘట్టాన్ని బుధవారం పలు ఆలయాల్లో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్ని ముగించుకోవడంతో భక్తులు 30వ పాశురాన్ని అనుసంధానం చేశారు. ఈ రోజున అన్ని వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది.
వైభవంగా భోగి పర్వం..
ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం భోగి పర్వదినాన్ని సంబురంగా జరుపుకున్నారు. తెల్లవారు జామున వాడవాడల్లో భోగి మంటలు వేసి చెడును దహింపజేసి మంచికి శ్రీకారం చుట్టారు. భోగి మంటలు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, పేరంటాల వాయనాలు, బొమ్మల కొలువులు.. గాలి పటాల సందడితో భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో భోగి మంటల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వాకిళ్లలో గొబ్బెమ్మలతో కూడిన రంగవల్లులు, సూర్య రథం ముగ్గుతో సంక్రాంతిని సాదరంగా స్వాగతించారు. పలు ఇండ్లల్లో చిన్నారులకు సాయంత్రం భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. భోగి సంబురాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం నాయకులు తెల్లం వెంకట్రావ్, మానెం నాగేశ్వరరావు వేడుకల్లో పాల్గొన్నారు. పండుగను వైభవంగా జరుపుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రైతన్నల పండుగ కనుమ...
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మూడవది కనుమ. శుక్రవారం కనుమ పండుగను జరుపుకోనున్నారు. ఇది రైతు ప్రాధాన్యతగా భావిస్తారు. ఈ రోజున రైతులు పశుపక్ష్యాదులను పూజిస్తారు. పాడిపంటలను తెచ్చిపెట్టే పశువులకు ఈ రోజు ఎటువంటి పని చెప్పకుండా, భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. వ్యవసాయ పనిముట్లును శుభ్ర పర్చుకుని పూజలు చేస్తారు. పశువులను అలంకరించి, పసుపు కుంకుమలతో పూజిస్తారు.
తాజావార్తలు
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైల్‌కు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ప్రభుత్వ పెద్దలు సంయమనంతో మాట్లాడాలి’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్‌కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్
- 'ఆందోళన నుంచి వైదొలుగుతున్నాం'
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు