సోమవారం 18 జనవరి 2021
Badradri-kothagudem - Dec 06, 2020 , 03:04:42

అప్రమత్తతతోనే సురక్షితంగా ఉంటాం : కలెక్టర్‌

అప్రమత్తతతోనే సురక్షితంగా ఉంటాం : కలెక్టర్‌

కొత్తగూడెం: అప్రమత్తత, జాగ్రత్తలు పాటించడం ద్వారా మాత్రమే కరోనా, సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలు సురక్షితంగా ఉంటారని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి కరోనా, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యలు, స్కోచ్‌ అవార్డుకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ప్రక్రియ, పంటల కొనుగోళ్లు అంశాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు మన జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డుకు ఎంపికైందని, ప్రజలు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా మన జిల్లాకు అవార్డు తీసుకురావాలన్నారు. స్కోచ్‌ అవార్డుకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ ఓటింగ్‌ 7వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని, మన జిల్లాకు అవార్డును అందజేయడంలో ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని చెప్పారు. ప్రతీశాఖ సిబ్బంది వారి పరిధిలో ఉన్న అన్ని గ్రూపులు ద్వారా అవగాహన కల్పించి ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా నియంత్రణకు మండల స్థాయిలో ఏర్పాటు సమన్వయ కమిటీ ప్రతి రెండు రోజులకు సమీక్షలు నిర్వహించి వ్యాప్తిని అరికట్టే విధంగా చర్యలు తీసుకురావాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో మెప్మా గ్రూప్‌ సభ్యులు, రైతుబంధు, వార్డు కమిటీల సభ్యులతో వ్యాధి వ్యాప్తి గురించి అవగాహన కల్పించాలని, చలికాలంలో వైరస్‌ వ్యాప్తి అధికంగా జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.