Badradri-kothagudem
- Dec 05, 2020 , 06:21:57
ప్రశాంతంగా పత్తి కొనుగోళ్లు..

- జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ, మార్కెట్లలో ప్రైవేట్ వ్యాపారులు
- నేటి వరకు ఖమ్మంలో 2.93 లక్షల క్వింటాళ్లు..
- భద్రాద్రి జిల్లాలో 1,66,368 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు
- 6,581 మంది రైతులకు ప్రయోజనం
ప్రశాంతంగా పత్తి విక్రయాలు
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పత్తి కొనగోళ్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యాపారులు గ్రామాల్లో, మార్కెట్లలో పంటను కొనుగోలు చేస్తున్నారు. ఆయా జిన్నింగ్ మిల్లుల దగ్గర భారత పత్తి సంస్థ (సీసీఐ) అధికారులు పంటను కొనుగోలు చేస్తున్నారు. వానకాలం సీజన్లో సాగు చేసిన పత్తి పంట నెల రోజుల నుంచి ప్రైవేట్ మార్కెట్‌కు వస్తోంది. పక్షం రోజుల క్రితం సీసీఐ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జిల్లాలో పత్తి పంటను రైతులు ప్రధాన పంటగా సాగు చేశారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నియంత్రిత సాగుకు లోబడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు, ఆయా జిన్నింగ్ మిల్లులకు జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల రైతులు సైతం కొద్ది రోజుల నుంచి పంటను తీసుకొస్తున్నారు. సీజన్ ఆరంభంలో ఆశించిన మేర ధర పలకలేదు. విస్తారంగా వర్షాలు కురవడంతో నాణ్యమైన పంట రాలేక పోయింది. దీంతో పత్తి క్వింటాలుకు కేవలం 4,500 లోపు మాత్రమే ధర పలికింది. కొద్ది రోజుల క్రితం సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ప్రైవేట్ మార్కెట్లో ఒక్కసారిగా పోటీతత్వం పెరగడంతో పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురవారం నాటికి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం , మధిర, ఏన్కూరు మార్కెట్ల పరిధిలో పైవేట్ వ్యాపారులు 1,04 714 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొనడం, జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తి పంటకు మంచి డిమాండ్ పలుకుతుండటం వంటి కారణాలతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ మార్కెట్లో పత్తి పంట ధర క్వింటాలుకు రూ.5 వేల నుంచి రూ.5,400 వరకు నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్ల ప్రక్రియను జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి కే.నాగరాజు, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ ఆర్.మల్లేశం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సైతం మంచి ధర పలుకుతుండటంతో పంటను తీసుకవచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
1.89లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు
జిల్లా వ్యాప్తంగా భారత పత్తి సంస్థ 12 కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేస్తోంది. క్వింటాలుకు గరిష్ట ధర రూ.5,725 చొప్పున నిర్ణయించి అధికారులు జిన్నింగ్ మిల్లుల దగ్గర కొనుగోలు చేపట్టారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రెండు కేంద్రాల ద్వారా 1,638మంది రైతుల నుంచి 49,115 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేశారు. మధిర మార్కెట్ పరిధిలో 5 కేంద్రాల ద్వారా 1,760 మంది రైతుల నుంచి 53,777 క్వింటాలు, వైరా మార్కెట్ పరిధిలో ఒక కేంద్రం ద్వారా 360 మంది రైతుల నుంచి 1,005 క్వింటాలు, మద్దులపల్లి మార్కెట్ పరిధిలో రెండు కేంద్రాల ద్వారా 2,823 మంది రైతుల నుంచి 77,069 క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి వరకు 12 సీసీఐ కేంద్రాల ద్వారా 6,581 మంది రైతుల నుంచి 1,89,968 క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు.
భద్రాద్రి జిల్లాలో 1,66,368 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు
కొత్తగూడెం: నియంత్రిత సాగు విధానానికి జై కొట్టిన రైతులు పత్తి సాగులో ఈ ఏడాది దూసుకు పోయారు. మక్కకు స్వస్తి పలికిన రైతులు వానకాలం పంటలో నిరుటి కంటే అధికంగా పత్తి సాగు చేశారు. వందశాతానికి మించి పత్తిని పండించారు. భద్రాద్రి జిల్లాలో 2,07,960 ఎకరాల్లో పత్తిపంటను సాగు చేసి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు కావడం రైతులకు అనుకూలం కావడంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 1,66,368 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 1,83,416 ఎకరాల్లో పత్తిసాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా అంతకు మించి 1,93,191 ఎకరాల్లో పంటను సాగు చేసి రైతులు రికార్డు సృష్టించారు.
కొనుగోళ్లు చేస్తున్నాం..
పత్తి కొనుగోళ్లను ప్రారంభించాం. సుజాతనగర్ మండలంలో ఉన్న జిన్నింగ్ మిల్లు వద్ద కొనుగోళ్లను ప్రారంభించాం. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొనుగోళ్లను ప్రారంభించారు.
-నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి
తాజావార్తలు
MOST READ
TRENDING