శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Dec 05, 2020 , 02:45:43

వైద్యారోగ్యశాఖ సమీక్ష

వైద్యారోగ్యశాఖ సమీక్ష

  •  మాతా శిశు మరణాలు అరికట్టేందుకే..బర్త్‌ వేయింగ్‌ కేంద్రాలు
  • హైరిస్క్‌ ఉన్న మహిళలకు  వైద్య పరీక్షలు చేయాలి
  • పౌష్టికాహారలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  •  వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కరుణ
  • భద్రాద్రి కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమావేశం

కొత్తగూడెం/భద్రాచలం : మాతృమరణాలను అరికట్టేందుకు బర్త్‌ వేయింట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ పేర్కొన్నారు. భద్రాద్రి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం వైద్యారోగ్యశాఖ సమీక్షలో ఆమె మాట్లాడారు. గర్భిణుల్లో రక్తహీనత వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆశాలు, ఏఎన్‌ఎం ద్వారా సమాచారం తీసుకుని నిరంతర వైద్య సేవలు అందించాలని సూచించారు. హైరిస్క్‌ ఉన్న మహిళలకు వైద్య పరీక్షలు చేసి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం వల్లే తప్పనిసరిగా మాతాశిశు మరణాలు అరికట్టవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గడిచిన ఐదేళ్ల నుంచి ప్రసవాల జాబితాను ఆధారంగా డేటా తయారు చేయాలన్నారు.

ప్రతీ ప్రాణం చాలా విలువైనది అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలున్న ఈ జిల్లాలో మహిళలు సికెల్‌ సెల్‌, అనీమియా, తలసేమియా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, విద్యాశాఖ కూడా సంయుక్తంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత కలెక్టర్‌ నేతృత్వంలో వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యల ఫలితంగా 75 రోజుల పాటు ఒక్క కేసు కూడా నమోదుకాక పోవడం విశేషమని అన్నారు. భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఐటీడీఏ పీఓ గౌతం, అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌, డీసీహెచ్‌ఎస్‌ ముక్కంటేశ్వరరావు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సరళ, ఆరోగ్య శాఖ అధికారులు, కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ చేతన్‌, జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా భద్రాచలం ఆసుపత్రి

అత్యాధునిక వసతులతో, సదుపాయాలతో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఉందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆ మె.. తొలుత ఏరియా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొం దుతున్న రోగులతో మాట్లాడారు. అలాగే ప్రసూతి వార్డులో మహిళలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ కరోనా పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో సిబ్బంది కొరత దృష్ట్యా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంత పరిధిలోని సబ్‌ సెంటర్ల నిర్మించేటప్పుడు లైటింగ్‌ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ యుగందర్‌, ఎండీఎంహెచ్‌వో శ్రీనివాసులు, తహసీల్దారు శ్రీనివాస యాదవ్‌, ఆర్‌ఎంవో రాజశేఖర్‌, వైద్యులు రాజీవ్‌, శ్రీనివాసులు, రాంబాబు, విజయ్‌ పాల్గొన్నారు.