ఆదివారం 24 జనవరి 2021
Badradri-kothagudem - Dec 03, 2020 , 02:27:32

ధాన్యపు సిరి..

ధాన్యపు సిరి..

  • ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.26.4 కోట్లు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా ధాన్యం సేకరణ
  • ఖమ్మంలో 445 కేంద్రాలు ప్రారంభానికి ఏర్పాట్లు
  • ఇప్పటికే 238 ప్రారంభం.. 43,778 మెట్రిక్‌  టన్నుల ధాన్యం సేకరణ

ఖమ్మం/కొత్తగూడెం : అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పారదర్శకంగా అమలు చేస్తోంది. దీంతో నాడు వ్యవసాయం దండుగ అన్న రైతులు నేడు పండుగలా సాగు చేపడుతున్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతును రాజు చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంది. ఒకవైపు రైతుకు సాగునీరు అందించే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తుంది. మరోవైపు పంటకు అవసరమయ్యే పెట్టుబడిని అందించడంతో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో 445 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఐతే ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 238 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా మంగళవారం నాటికి 4,951 మంది రైతుల నుంచి 43వేల 779 మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని సేకరించారు. దీనికి గాను రైతులకు 14 కోట్ల 81 లక్షల 7వేల 157 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఖమ్మం జిల్లాలో 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం..

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 4లక్షల 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. జిల్లాలో రైతులు ఈ సీజన్‌లో 7లక్షల 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని పండించినట్లుగా అధికారులు అంచనా వేశారు. దీనిలో దాదాపు లక్ష ఎకరాల్లో లావురకం ధాన్యం కాగా మిగిలిన 6లక్షల ఎకరాల్లో సన్నరకం ధాన్యం పండించారు. రైతుల వ్యక్తిగత అవసరాలు పోను మిగిలిన ధాన్యాన్ని అధికారులు సేకరించనున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది గ్రేడ్‌ -ఏ రకానికి క్వింటాకు రూ.1888 ధర నిర్ణయించగా, కామన్‌ రకం ధాన్యానికి రూ.1868గా నిర్ణయించింది. 

ఇప్పటి వరకు 43వేల 779 మెట్రిక్‌ టన్నుల సేకరణ...  

ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 43,779 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనిలో గ్రేడ్‌-ఏ రకం 39,610 మెట్రిక్‌ టన్నులు, కామన్‌ రకం 4169 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉన్నది. ఐకేసీ ఆధ్వర్యంలో 53 కేంద్రాల ద్వారా 8550 మెట్రిక్‌ టన్నులు, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 130 కేంద్రాల ద్వారా 31,814 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 28 కేంద్రాల ద్వారా 3015 మెట్రిక్‌ టన్నులు, వ్యవసాయ మార్కెట్ల ఆధ్వర్యంలో 7 కేంద్రాల ద్వారా 399 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం తరలిస్తున్నారు. 

కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణే లక్ష్యం..

జిల్లాలో మార్కెటింగ్‌, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులతో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభింపజేశారు. గత ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లకు 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ సారి రికార్డు స్థాయిలో 248 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 210 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయడంతో రైతు పండించిన పంట పూర్తి స్థాయిలో సర్కారు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది వానకాలంలో 1,30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగిలో 60,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు పీఏసీఎస్‌ 205, డీఆర్‌డీఏ ద్వారా 16, మార్కెటింగ్‌ 8, జీసీసీ 19 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నారు.

అక్రమాలకు తెర.. 

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని సందర్భంలో మార్కెట్‌లో వ్యాపారులదే రాజ్యం. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి వారు నిర్ణయించిన ధరకే రైతులు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని తిరిగి తీసుకుపోయే పరిస్థితి లేకపోవడంతో వచ్చినంత ధరకు విక్రయించడంతో తీవ్రంగా నష్టపోవడం రైతుల వంతు అయ్యేది. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్‌లో ధాన్యం ధరలు పెరిగి రైతులకు మేలు కలుగుతుంది. తేమశాతం, చెత్త, ఇతర వాటి శాతం అధికంగా ఉంటే మార్కెట్‌లో విక్రయిస్తున్నా  మరీ తక్కువ కాకుండా విక్రయించే పరిస్థితి కేవలం కొనుగోలు కేంద్రాల వల్లే ఏర్పడిందని చెప్పవచ్చు.

మద్ధతు ధర..

రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు చేసింది. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేసేందుకు మద్దతు ధర కొనుగోలుకు నిర్ధేశించిన ప్రమాణాలను కరపత్రాల ప్రచారం చేశారు. మరోవైపు గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులు కాంటాలు పెట్టి ప్రజలను మోసం చేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దని, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు.  


logo